More

    పాక్ లో 21 మంది సజీవ దహనం

    పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలోని బస్సులో మంటలు చెలరేగి 21 మంది చనిపోయారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. చనిపోయినవారిలో ఎక్కువగా చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. సింధ్ ప్రావిన్స్ ఖైర్ పూర్ నాథన్ షా ప్రాంతానికి చెందిన 45 మంది వరద బాధితులు తమ ఇళ్లకు వెళుతుండగా.. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఏసీ బస్సు కావటం.. కిటికీలన్నీ మూసి ఉండటంతో కొందరు పొగతో ఊపిరాడక చనిపోయారు.

    ఆగస్టులో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తగా.. వరద బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో.. వరద బాధితులు అందరూ తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వరద బాధితులు రైల్, బస్సులలో సొంతూర్లకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోరో జిల్లా నూరియాబాద్ ఎం-9మోటర్‌ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే బస్సు మంటల్లో కాలి బూడిదయ్యింది. బస్సులో ఉన్న వారు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

    బస్సు నుంచి పదకొండు మంది మృతదేహాలను వెలికి తీశామని, అందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని నూరియాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) వాజిద్ తాహీమ్ ధృవీకరించారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారని తెలిపారు. వారందరూ ముఘైరీ కమ్యూనిటీకి చెందినవారని అధికారులు తెలిపారు. కోచ్‌లోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా మంటలు సంభవించాయని, మృతదేహాలను లియాఖత్ యూనివర్శిటీ హాస్పిటల్ జంషోరోకు తరలించామని అధికారులు తెలిపారు. వాలంటీర్లు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

    Trending Stories

    Related Stories