బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు.
ప్రధాని మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా.. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలోనూ కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా.. ప్రధానికి ఘన స్వాగతం పలకాలని, సభను విజయవంతం చేయాలని బీజేపీ భావిస్తోంది. బహిరంగ సభ జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిసాయి. పరేడ్ గ్రౌండ్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్ సిగ్నల్ వద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది. ఈ ప్లెక్సీలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని రాస్తూనే బైబై మోదీ అనే ట్యాగ్ ను జోడించారు.ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు అనే దానిపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న కంటోన్మెంట్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించారు.