పాక్-బంగ్లాదేశ్ మధ్య జెండా వివాదం..! ఫేస్‎బుక్ పేజీలో కవర్ ఫోటో తొలగింపు

0
942

రెండు ముస్లిం దేశాలే.. అందులోనూ మిత్ర దేశాలు. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఓ వివాదం రాజుకుంది. ఉగ్రవాద దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మధ్య జెండా వివాదం మరింత ముదురుతోంది.

బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ కోరిక మేరకు ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్‌, తమ ఫేస్‌బుక్ పేజీ కవర్ ఫొటోగా ఉన్న ‘బంగ్లాదేశ్-పాకిస్తాన్’ జెండా చిత్రాన్ని తొలగించింది. ఆ తర్వాత ఫేస్‌బుక్ కవర్ ఫొటోగా కేవలం పాకిస్తాన్ జెండా ఫొటోను ఉంచారు. జూలై 21న పాకిస్తాన్ హైకమిషన్ ఫేస్‌బుక్ పేజీకి బంగ్లాదేశ్-పాకిస్తాన్ దేశాల జెండాలను కలిపి చూపే చిత్రాన్ని కవర్ ఫొటోగా పెట్టారు. బంగ్లాదేశ్‌లోని చాలా సంస్థలు ఈ ఫొటోపై స్పందించడం మొదలుపెట్టాయి. దీంతో బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ కవర్ పేజీని తీసేయాలని పాకిస్తాన్ హైకమిషన్‌ను కోరింది. తమకు ఇది ఇష్టం లేదని తెలిపింది. అందుకే దాన్ని తొలగించాలని పాకిస్తాన్ ను కోరామని విలేఖరుల సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ అన్నారు.

ఈ చిత్రాన్ని ఎందుకు పెట్టారని బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ పాకిస్తాన్‌ను ప్రశ్నించారు. దానితో పాటు పాక్ హైకమిషన్ పంపించిన కొన్ని చిత్రాలను ఆయన తన ఫోన్‌లో చూపించారు. ఈ నమూనా చిత్రాలను పాక్ హైకమిషన్ తనకు పంపించిందని ఆయన చెప్పారు. సింగపూర్, శ్రీలంక, సౌదీ అరేబియా, మలేసియా వంటి దేశాల ఫేస్‌బుక్ పేజీల్లో కూడా ఇలాగే రెండు జెండాల చిత్రాలను కలిపి పెట్టామని పాక్ హైకమిషన్ చెప్పిందని అబ్దుల్ తెలిపారు. తమ జెండాతో కలిపి రూపొందించినట్లుగానే మిగతా దేశాల జెండాలతో కూడా వారు కవర్‌ఫొటోలు రూపొందించారని వెల్లడించారు. తప్పుడు ఉద్దేశంతో వారు ఇలా చేయలేదని… తమ కోరికను వారు అంగీకరిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాక్ హైకమిషన్ వివరణతో సంతృప్తి చెందినట్లు ఆయన స్పష్టం చేశారు. తమకు ఇది నచ్చలేదు అని వారికి చెప్పామని… దీన్ని వారు డిలీట్ చేస్తారని తాము నమ్ముతున్నామన్నారు. మిగతా దేశాల జెండాతో ఫేస్‌బుక్ కవర్ పేజీని పెట్టుకున్నట్లే బంగ్లాదేశ్ జెండాతో కూడా పెట్టుకోవచ్చనే వారు అనుకున్నారని అభిప్రాయపడ్డారు. మిగతా దేశాల వారు దీనికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదని పాక్ చెప్పినట్లు ఆయన వివరించారు. అయితే, బంగ్లాదేశ్ విదేశీ శాఖ విలేఖరుల సమావేశం నిర్వహించడానికి కొద్దిసేపటి ముందు పాకిస్తాన్ హైకమిషన్ కవర్‌పొటోను మార్చేసింది. కేవలం పాక్ జెండాను మాత్రమే ఫొటోగా పెట్టింది.

ఈ ఫొటో కారణంగా ఎలాంటి రాజకీయ వివాదంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే ఫొటోను తొలిగించమని పాక్‌ను కోరినట్లు బంగ్లాదేశ్ తెలిపింది. కవర్‌పేజీగా ఫొటోను పెట్టినప్పటి నుంచి చాలా సంస్థలు, బంగ్లాదేశ్ జెండాను అవమానించారంటూ విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. అయితే, కొన్ని నెలల క్రితమే బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చాలా దేశాలు బంగ్లాదేశ్ జెండాతో కూడిన తమ దేశ జెండా చిత్రాలను విడుదల చేశాయి. అయితే రెండు మిత్ర దేశాలు అయినప్పటికీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య చాలా తేడా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ తో పలుమార్లు వివాదాలు సైతం ఏర్పడ్డాయి. గతంలోనూ తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ను ఘాటుగా హెచ్చరించింది. జమాత్-ఎ-ఇస్లామి నేత, 1971 యుద్ధ నేరస్తుడు మిర్ ఖాసిం అలీ ఉరిపై పాకిస్తాన్ వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్ ఈ హెచ్చరిక చేసింది. ఈ విషయంలో ఢాకాలోని పాకిస్తాన్ రాయబారి సమీనా మెహతాబ్ కు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేశారు. మిర్ ఖాసిం అలీని బంగ్లాదేశ్ 2016లో ఉరి తీయగా, ఈ ఘటన తమను ఎంతో బాధించిందని ఉరి తీసిన గంటకే పాకిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్, ఇలాంటి వ్యాఖ్యలు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకు వస్తాయని వెల్లడించింది. పాకిస్తాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని హెచ్చరించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twelve + one =