More

  అయిదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

  జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నిషేధిత ఉగ్ర సంస్థ టీఆర్‌ఎఫ్‌కు చెందిన కమాండర్‌తో సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాంబేలో ముగ్గురు, గోపాల్‌పోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గోపాల్‌పోరా ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ఉగ్రవాదులు మరణించారు.

  మరో ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన మిలిటెంట్ కమాండర్ అఫాక్ సికందర్‌ను కుల్గామ్‌లో భద్రతా బలగాలు హతమార్చాయి. ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ టెర్రరిస్ట్ కమాండర్ అఫాక్ సికిందర్ హతమయ్యాడని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సోమవారం శ్రీనగర్‌లోని హైదర్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

  సరిహద్దుల్లో డ్రోన్ కలకలం:

  పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భారత్‌-పాక్ సరిహద్దులో పాక్‌ డ్రోన్‌లు మరోసారి కనిపించాయి. అయితే, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్పులు జరపడంతో డ్రోన్ పాకిస్థాన్‌ వైపునకు తిరిగి వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున అమృత్‌సర్‌ తహసీల్‌ అజ్నాలాలోని సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద పాక్ నుంచి వస్తున్న డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్‌ సైనికులు గుర్తించారు. ఆ తర్వాత బీఎస్‌ఎఫ్‌ సైనికులు డ్రోన్‌పై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. బీఎస్‌ఎఫ్‌ కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ తిరిగి వెళ్ళిపోయింది. ఘటన తర్వాత పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది డ్రోన్ తిరుగాడిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్ లోకి జారవిడుస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

  Trending Stories

  Related Stories