తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! నమ్మిన వాళ్లే తనను మోసం చేశారంటూ ఈటల రాజేందర్ ఆరోపిస్తూ టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేశారు. పార్టీకి తాను ఎంతో చేశానని.. కానీ తనపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ ఈటల తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక ఇప్పుడు బీజేపీలో చేరారు.
ఈటల రాజేందర్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈటలకు టీఆర్ఎస్ అన్యాయం చేయలేదని.. 2003 ఎన్నికల్లో ఎంతో కష్టమైనా ఈటలకు టికెట్ ఇచ్చామని చెప్పారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎంత ఇచ్చిందో, ఏమి చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవిస్తూనే ఇతర పార్టీలతో ఈటల సంప్రదింపులు జరిపారని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అక్కడే మాట్లాడితే పోయేదని అయితే సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి పార్టీకి ఆయనే దూరమయ్యారన్నారు కేటీఆర్. హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ పార్టీల మధ్యే ఉంటుందని, వ్యక్తుల మధ్య కాదని అన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యపై తప్ప విపక్షాలకు మాట్లాడేందుకు మరో అంశం లేదని చెప్పారు. జల వివాదాల్లో న్యాయమే గెలుస్తుందని, ఏపీ ఎన్ని కేసులు వేసినా న్యాయబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు కేటీఆర్.