యుద్ధం గెలవడానికి వ్యూహం.. యుద్ధం చెయ్యడానికి ఆయుధం అత్యంత అవసరం..! ఈ రెండూ పక్కాగా ఉంటే.. శత్రువు ఎంతటి బలవంతుడైనా మట్టికరవక తప్పదు. ఇప్పుడు భారత్ వద్ద పక్కా వ్యూహాలే కాదు.. పటిష్టమైన ఆయుధాలు కూడా వున్నాయి. నానాటికీ భారత అమ్ములపొది అత్యాధునిక ఆయుధాలతో బలోపేతమవుతోంది. తాజాగా.. పాక్ పైశాచికాన్ని, డ్రాగన్ డాంభీకానికి ఏకకాలంలో అణచివేసే ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. ఈ రెండు శత్రుదేశాల నుంచి నిత్యం ముప్పు పొంచి ఉన్న వేళ.. భారత అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధం చేరింది. శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను క్షణకాలంలో గుర్తించి.. వాటి అనవాళ్లు కూడా లేకుండా ముక్కల చేసే.. అత్యాధునిక ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ భారత్‌కు చేరుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన 5 యూనిట్ల తొలి స్క్వాడ్రన్‌ను పంజాబ్ సెక్టార్లో మోహరించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. త్వరలోనే చైనా సరిహద్దుల్లో కూడా మోహరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే, ఎస్–400 రెండు క్షిపణుల్ని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఎస్-400 రాకతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ.. పాకిస్తాన్‌తోపాటు చైనా నుంచి పొంచివున్న గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలదు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో ఎస్–400ను మించిన ఆయుధం ప్రపంచంలో ఇప్పటివరకు లేదు. అమెరికా థాడ్ వ్యవస్థ కంటే కూడా ఎస్-400 చాలా పటిష్టమైన క్షిపణి నిరోధక వ్యవస్థ. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. తొలి స్వ్వాడ్రన్ ఏర్పాటు తర్వాత.. తూర్పు సరిహద్దులపై ఎయిర్ ఫోర్స్ దృష్టి సారించనుంది. పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలు ఈ అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఆ రెండు దేశాల నుంచి భారత్ లక్ష్యంగా ఏదైనా యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుంటే.. ఇక దానికి మూడినట్టే.
నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకొనేందుకు రష్యా ఈ ఎస్-400 రక్షణ వ్యవస్థను వాడుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా, చైనా, టర్కీ మాత్రమే వీటిని వినియోగిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో.. శత్రుదేశాల యుద్ధ విమానాలు, రాకెట్లు, డ్రోన్లను కూల్చే వ్యవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నో రకాల ఆయుధాలు కలిగిన మల్టిపుల్ వెపన్ ప్యాకేజీ అనొచ్చు. దీనిని 2007లో రష్యా తొలిసారి తన సైన్యంలో ప్రవేశపెట్టింది. అదే ఏడాది జులైలో ఆకాశంలో సెకన్‌కు 2,800 మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఎస్-400 ఛేదించినట్లు రష్యా ప్రకటించింది. రష్యాకు వ్యతిరేకంగా పని చేసే నాటో కూటమిలో టర్కీ భాగమైనప్పటికీ.. రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థన దిగుమతి చేసుకోవడాన్ని బట్టి దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం ఎస్-400 వ్యవస్థ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి.
అసలు ఎస్-400 ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎస్-400 వ్యవస్థలో ఒక పెద్ద బ్యాటరీ, దీర్ఘశ్రేణి రాడార్, టార్గెట్‌ను గుర్తించే రాడార్ ఉంటాయి. ప్రతి లాంచర్‌కి నాలుగు ట్యూబులు ఉంటాయి. కమాండర్ పోస్టు వాహనంలో 8మందితో కూడిన రెండు బెటాలియన్లు ఈ వ్యవస్థను కంట్రోల్ చేస్తారు. కమాండర్ పోస్టు, రాడార్లు, లాంచర్లు ఎత్తు పల్లాలు ఉండే భూభాగం మీద కూడా ప్రయాణించగలదు. ఈ క్షిపణి వ్యవస్థను వాహనాలపై ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించవచ్చు. దీంతో భారత సరిహద్దుల్లో ఎక్కడైనా మోహరించే వీలుంది. దాదాపు 400 కిలోమీటర్ల పరిధిలో శత్రు వ్యూహాత్మక బాంబర్లు, జెట్‌లు, గూఢచారి విమానాలు, క్షిపణులు, డ్రోన్‌లను గుర్తించి నాశనం చేయగల శక్తి ఈ ఆటోమేటెడ్ ఎస్-400 క్షిపణి వ్యవస్థలో ఉంది. పశ్చిమ, ఉత్తర, తూర్పు భాగంలో చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్ధంగా వీటితో ఎదుర్కోవచ్చు.
ఎస్-400 కనీస లక్ష్యం పరిధి 2 కిలోమీటర్లు. అలాగే.. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం ఉందని చెబుతారు. సెకన్‌కు 4.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే టార్గెట్‌ను గుర్తించి పేల్చేసే శక్తి దీని సొంతం. 30 కిలోమీటర్లు నుంచి 56 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాటిని పేల్చేయగలవు. ప్రత్యర్థి టార్గెట్‌లను గుర్తించి.. 9 నుంచి 10 సెకన్లలోనే ఎదురుదాడికి సిద్ధమవుతుంది. గంటలకు 4,284 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. టార్గెట్‌ను గుర్తించాక వీటి వేగం 17,280 కిలోమీటర్లకు చేరుతుంది. యాక్టివ్ రాడార్ హోమింగ్ హెడ్ అనే సిస్టమ్ ఉండడం వల్ల మిసైల్.. ఫిక్స్ చేసిన ఎత్తుకు వెళ్లి అక్కడ టార్గెట్‌ను గుర్తించి నాశనం చేస్తుంది. ఎస్-400 సర్వీస్ లైఫ్ కనీసం 20 ఏళ్లు. అంతేకాదు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గైడెడ్ క్షిపణుల జీవిత కాలం 15 ఏళ్లు.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎస్-400 రాకతో.. ఎంతటి బలమైన శత్రువైనా మట్టి కరవాల్సిందే..! ఇప్పటికే ఎస్-400 వినియోగంపై రష్యాలో భారత ఎయిర్ ఫోర్స్ అధికారులకు శిక్షణ పూర్తయింది. ఇప్పటికే విడిభాగాలు భారత్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. త్వరలోనే అన్ని విడిభాగాలు భారత్ కు చేరుకోనున్నాయి.
రక్షణ ఒప్పందంలో భాగంగా చిరకాల మిత్రుడు రష్యా నుంచి ఎస్-400లను కొనుగోలు చేసింది భారత్. 35 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసేందుకు గతంలో రష్యాతో ఒప్పందం చేసుకుంది. అయితే, భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామిగా వున్న అమెరికాకు.. ఈ ఒప్పందం మొదటి నుంచి ఇష్టం లేదు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడం పట్ల విముఖత ప్రదర్శిస్తూనేవుంది. ట్రంప్ హయాం నుంచే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ ఈ క్షిపణి వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా.. వీటిని కొనుగోలు చేసేందుకు మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. తన ప్రత్యర్ధి దేశాలను ఎదుర్కొనే కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తోంది. అయితే, కాట్సా చట్టం అమల్లోకి రావడానికి ముందే ఈ ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయని భారత్, అమెరికాకు సర్ది చెప్పింది.
2015లో ఈ వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని, 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం 2018లో ఖరారైందని వివరించింది. అయినప్పటికీ ఈ ఒప్పందాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. తాను అభివృద్ధిపరచిన టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, పేట్రియాట్ సిస్టమ్స్‌ను ఇస్తామని భారత్‌కు చెప్పింది. అయినా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దేశ రక్షణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. పెద్దన్న బెదిరింపులకు తలొగ్గలేదు. డిసెంబర్ తొలివారంలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఎస్-400 క్షిపణి ఒప్పందాన్ని భారత రక్షణ సామర్థ్యానికి చాలా ఆచరణాత్మక అర్ధం ఉందని చెప్పారు. ఈ సహకారాన్ని అణగదొక్కడానికి, అమెరికా ఆదేశాలను భారతదేశం పాటించేలా చేయడానికి ఆ దేశం చేసిన ప్రయత్నాలను మేం కూడా చూశామని అన్నారు. తమది సార్వభౌమ దేశమని మా భారతీయ స్నేహితులు స్పష్టంగా, దృఢంగా వివరించారని అన్నారు. ఎవరి నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలో, వివిధ రంగాలలో భారతదేశానికి ఎవరు భాగస్వామిగా ఉండాలో వారు నిర్ణయిస్తారని షోయిగు స్పష్టం చేశారు.
రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలతో ఆర్థిక, రక్షణ సంబంధాలను కలిగియుండే దేశాలపై ఆంక్షలు విధించడానికి కాట్సా చట్టాన్ని అమెరికా ఉపయోగిస్తోంది. ఎస్-400 మిసైల్ సిస్టమ్స్ కొనుగోలు చేయకుండా చైనా, టర్కీలను నిలువరించేందుకు ఈ చట్టాన్ని ప్రయోగించింది. అయితే, భారత్ పై ఈ చట్టాన్ని ప్రయోగించకపోవడానికి పలు విశ్లేషణలున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఢీ కొట్టాలంటే అమెరికాకు భారత్ బలం, సహాయం చాలా అవసరం. పైగా ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆగడాలను కట్టించేందుకు ఏర్పడిన యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌ల క్వాడ్ కూటమిలో భారత్ కూడా కీలక భాగస్వామి. అందుకే, ఎస్-400 కొనుగళ్ల విషయంలో అమెరికా కళ్లు మూసుకుని ఉండవచ్చనేది రక్షణ రంగ నిపుణుల వాదన.
అగ్రరాజ్యానికి శత్రుదేశమైన రష్యాతో భారత్‌కు దశాబ్దాల మైత్రి ఉంది. ఇటీవల పుతిన్-మోదీ భేటీతో ఇరు దేశాల బంధం బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 చర్చలు కీలకంగా నిలిచాయి. ఈ భేటీలతో సైనిక, సాంకేతికత పరంగా భారత్‌కు రష్యా సహకారం దక్కనుంది. ఇప్పటికే అధునాతన ఎస్-400 క్షిపణి వ్యవస్థను అందించిన రష్యా.. ప్రపంచంలోనే అత్యాధునిక, శక్తిమంతమైన రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందిన ఎస్-500 అందించేందుకు కూడా రష్యా సిద్ధపడింది. భారత్, చైనా సహా రష్యాతో సుదీర్ఘ అనుబంధం కలిగిన దేశాలు ఎస్-500 వ్యవస్థను కొనుగోలు చేస్తాయని ఇటీవల రష్యా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. త్వరలోనే ఎస్-500 క్షిపణి వ్యవస్థ రష్యా సైన్యంలోకి చేరనుంది. 2030 నాటికి వాటి ఎగుమతులను ప్రారంభించాలని పుతిన్ సర్కారు భావిస్తోంది. ఆ దేశ ఆయుధ ఎగుమతుల సంస్థ అధిపతి అలెగ్జాండర్ మిఖేవ్ ఆ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు.
ఏదేమైనప్పటికీ, అత్యంత శక్తివంతమైన, అత్యాధునికమైన ఎస్-400 రాకతో.. శత్రు దేశాల్లో దడ మొదలైంది. ముఖ్యంగా బుసలు కొడుతున్న డర్టీ డ్రాగన్‌లో టెన్షన్ రెట్టింపు అయ్యింది. అటు.. చైనా అండదండలతో తోక జాడిస్తున్న జిత్తులమారి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. కొద్ది రోజులుగా.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో.. ఎస్-400 రావడంతో.. భారత సైన్యం నైతిక స్థయిర్యం పెరిగింది. శత్రు దేశాల్లో కలవరం మొదలైంది.