భారతదేశంలో తొలిసారిగా ఒక వ్యక్తికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకింది. ఈ ఘటన అసోంలో వెలుగు చూసింది. దిబ్రూగఢ్ లోని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్ సీ)లో పరీక్ష చేయించుకున్న ఓ వైద్యురాలికి రెండు వేరియంట్లు ఒకేసారి సోకినట్టు గుర్తించారు. వైద్యురాలు వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నప్పటికీ ఆల్ఫా, డెల్టా రకాల కరోనా సోకిందని ఆర్ఎంఆర్ సీ పేర్కొంది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఆమెలో కనపడ్డాయి. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. రెండు వేరియంట్లు ఒకేసారి సోకిన ఘటనలను ‘డబుల్ ఇన్ ఫెక్షన్’ అంటారని ఆర్ఎంఆర్ సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ వ్యక్తికి ఏదైనా వేరియంట్ సోకిన రెండు మూడు రోజుల్లో కానీ, యాంటీబాడీలు ఉత్పత్తి కావడానికి ముందుగా కానీ ఇలా మరో వేరియంట్ కూడా సోకే అవకాశం ఉంటుందట..! మే తొలి వారంలోనే ఈ కేసు నమోదైంది. వైద్యురాలి భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకినట్టు తేల్చారు. ఇలాంటి డబుల్ ఇన్ ఫెక్షన్ కేసులు చాలా అరుదు.
భారత జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఇంకా 40 కోట్ల మందికి ఈ వైరస్ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. తాజాగా నాలుగో జాతీయ సెరో సర్వేను రిలీజ్ చేసింది. ఈ నాలుగో సర్వేలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పిల్లలను కూడా చేర్చింది. దేశంలో 6-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 50 శాతానికిపైగా ఈ కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. అత్యధికంగా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్లలో 77.6 శాతం మందికి, ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వాళ్లలో 76.7 శాతం మందికి, 18-44 ఏళ్ల వయసు వాళ్లలో 66.7 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సెరో సర్వే తేల్చింది.