More

  సిరి‘వెన్నెల’ వీడి ఏడాది..! NH ఘన నివాళి..!!

  సినీ సాహితీ సామ్రాజ్యంలో బంగరు వన్నెలు కురిపించిన గేయ కవితా చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. మానవతావాదం, సమతావాదం రంగరించి.. దమన, దుర్మార్గ నీతిని, నిర్భయంగా నిలదీసిన సాహిత్య కవితా దురంధరుడు సిరివెన్నెల. అక్షర కుక్షి అనుంగ పుత్రుడు, వాగ్దేవి మాత ప్రసాదితుడాయన. సిరివెన్నెల సీతారామశాస్త్రి తొలి వర్ధంతి సందర్భంగా నేషనలిస్ట్ హబ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

  సిని వినీలాకాశంలో సాహితీరంగాన అడుగుపెట్టిన సీతారామశాస్త్రి.. తొలి చిత్రం సిరివెన్నెలతోనే గేయ కవితా చక్రవర్తిగా విశ్వవ్యాప్త కీర్తిప్రతిష్ఠలు పొందారు. ఈ చిత్రంలో ఆయన రాసిన పాటలన్నీ హిట్టే. అయితే, విధాత తలపున.. అనే పాట సూపర్ డూపర్ హిట్టే కాకుండా.. నంది అవార్డు సైతం కైవసం చేసుకుంది. అంతటి మహనీయుని, మహోన్నత గీత రచనా వైభవాన్ని ఒకసారి మననం చేసుకుని.. ఆయన అపూర్వ సినీ ప్రస్థానం సాగిన వైనాన్ని గుర్తుచేసుకుందాం.

  సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఏ పదమైన శ్రీ కారమే.. ఏ స్వరమైనా ఓంకారమే. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఇది త్రిమూర్తైక స్వరూపం. పద్మనాభుని నాభీ కమలం నుంచి ఉద్భవించిన సృష్టి కర్త బ్రహ్మ. ఆ బ్రహ్మ హృదయం నుంచి ఉద్భవించిన వేదం ఓంకారం. ఆది, అంతం లేని ఓంకారం ప్రాణ నాడులకు జీవం పోసిన తొలి శబ్దం. నిశ్చల కొలనులో విశ్వ ప్రతిబింబం మాదిరి నేత్రాలలో విన్యాసం చేసేదే ఓంకారం. గిరుల నడుమ ప్రతిధ్వనించే సృష్టి కర్త వీణాగానం వలే హృదయాంతరాల్లో మార్మోగే గానం ఓంకారం. సద్భావ సంగీత గంగా తరంగాలను తలపిస్తున్న సామవేద సారాంశం ఈ గీతం. జీవన సంబంధిత గీతాన్ని విరించిలా రచించా.. విపంచిలా వినిపించా. ప్రాత: సమయంలో…తూర్పున ఉదయించే బాలభానుని లేలేత కిరణాలు వీణా తీగెలుగా, గగన విహంగాలు ఆ వీణా తీగలను స్పశిస్తూ రాగయుక్త కిలకిలారావాలతో నృత్యంచేస్తూ విశ్వానికి ఆహ్వానం పల్కుతున్నాయి. ఆ అమృత ఘడియల్లో..విశ్వకావ్యానికి ఇది సారాంశంకాగా, నా ఉచ్ఛ్వాసం కవిత్వం, నా నిశ్వాసం గానం. ఇదీ సిరివెన్నెల, వెండి తెర వెన్నెల, సాహిత్య వన్నెల కలం నుంచి జాలువారిన అద్భుత గేయ రచనా గీతం.. విధాత తలపున..అనే పాట.

  ఏ తరహా పాటైన అలవోకగా రాయగలిగిన సిరివెన్నెల..జాతీయత, జాతీయ సమగ్రత, దేశభక్తి..పై రాసిన పాటలైతే కోకొల్లలుగా వున్నాయి. మూడున్నర దశబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు మూడు వేల పాటలను రాసి…ముప్పై మూడును హెచ్చవేస్తే వచ్చే అరవై ఆరేళ్ల వయస్సులో..గత ఏడాది నవంబర్ ముప్పయవ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినీ గేయ రచనలో ఆయన లిఖించిన 11 పాటలకు నంది అవార్డులు వచ్చాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. ఆయనకొచ్చిన అవార్డులు, రివార్డులను పరిశీలిస్తే చాంతాడు లిస్ట్ కనిపిస్తుంది.

  సినిమా జీవితానికి ప్రతిబింబం. రెండింటికీ తేడా ఏమిటంటే సినిమాలో కొంత నాటకీయత దాగి ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడే పాట మొదలవుతుంది. నా పాటల్లో నేను కనిపించొద్దని ఎప్పుడూ కోరుకుంటుంటాను. ఆ పాటను ఆస్వాదించే వారి భావాలే కనిపించాలన్నది నా ఆకాంక్ష. సమాజం, ప్రజలు అనే సామూహిక భావనల పట్ల నాకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి. అవి మనలోని చాలామందిలో ఉన్నాయని భావిస్తాను. అని సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చెప్పారు. సింధూరం సినిమా స‌మ‌యంలోని ఒక సంద‌ర్భాన్ని గురించి చెబుతూ.. ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని..’ పాటలో కొన్ని పంక్తులను సినిమాలో వినిపించలేదు. ‘సురాజ్యమవలేని సురాజ్యమెందుకని..సుఖాన మనలేని వికాస మెందుకని. సుమాల బలికోరే సమాజమెందుకని అడుగుతోంది అదిగో ఎగిరే భరతపతాకం. తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం. విషాదవర్షంలో వివర్ణ చిత్రమని..త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని తెలుపుతోంది అదిగో ఎగిరే భరతపతాకం. ఆకసానికి తనను ఎగరేసి ఏకాకిగా తననొదిలేసి పాతాళంలో నిలిచిన పౌరుల కరతాళ ధ్వని చూసి విలవిలలాడుతూ వెలవెలబోయెను మువ్వన్నెల జెండా.జలజల కురిసెను తెగిపడిపోయిన ఆశల పువ్వుల దండ’…ఈ లైన్స్‌ సినిమాలో వినిపించవు. వాటిలో ఎంతో ఆర్తి దాగివుందని నా నమ్మకం. భారతసోదరులు నిజంగా సంతోషంగా ఉన్నారా? స్వాతంత్య్ర ఫలాలు నిజంగా నెరవేరాయా? అనే ఆవేదనతో రాసిన పాట ఇది అన్నారు.

  చల్లనైన వెండి వన్నెల శీతల సోముడు చంద్రుడు. చల్లని మనసున్న కవితా సొబగుల ప్రవీణుడు సిరి వెన్నెల సీతారాముడు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. చేంబోలు ఆయన ఇంటి పేరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివనిలో ఆయన జన్మించారు. చేంబోలు వేంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన తొలి సంతానం. అక్కడ నుంచి స్వస్థలమైన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లికి వేంకట యోగి వచ్చారు. ‘సిరివెన్నెల’ బాల్యం అంతా అక్కడే గడిచింది.

  జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం ఎందుకు అంటారు. అఖండ మేధో సంపన్నుడు, అపర సరస్వతీ పుత్రునికి అకడమిక్ చదువులతో పని ఏలా..? ఏ విద్యలో ప్రవేశించినా అందులో ప్రథమస్థానమే పొందే సిరివెన్నెల…ఏ రంగంలో చదివినా పండు వెన్నెల్లాగనే ప్రకాశించగలరు. అయితే, కామ్ గా చదువుకోవాలని భావించారో ఏమో..తొలుత బీకామ్ లో చేరారు. అఖండ మేధా సంపత్తిని ‘కామ్’ర్స్ కే అంకితం చేసేయడం ఏమిటని…ధన్వంతరి వారసుడివి కావాలని ఎంబీబీఎస్ సాదరంగా ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి..అందులో చేరితే..టెలికమ్యూనికేషన్ రంగం తెగ ఫోన్ లు చేసేసి…ఆయన సేవల కోసం ఆత్రంగా చూసింది. ప్రతిఘటించాల్సిన చోట ఎంతటి సింహస్వప్నంలో ఉంటారో, ఆదరణీయుల పాట అంత సౌమ్యంగా వుండడం సీతారామశాస్త్రి మనస్తత్వం.. ఎవరి మాట కాదనలేని శాస్త్రి..వైద్య విద్యకు సున్నితంగా టాట చెప్పి..టెలికం డిపార్ట్ మెంట్ లో ఉద్యోగంలో చేరారు.

  పాఠశాల విద్యను అనకాపల్లిలో పూర్తిచేసిన సిరివెన్నెల 1971లో కాకినాడ ఐడియల్ కాలేజ్ లో ఇంటర్ చదవి ఆదర్శ విద్యార్థిగా పేరుతెచ్చుకున్నారు. 1973 లో ఇక్కడి పీ.ఆర్.కళాశాలలో బీ.కామ్ లో చేరి, అదే ఏడాది ఆంధ్రా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారు. ఒక్క ఏడాది చదివారో లేదో..ఆయనకు 1974 సెప్టెంబర్ నెలలో టెలికం శాఖలు కొలువు లభించింది. అప్పటి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన టెలికం డిపార్ట్ మెంట్ లో సేవలు అందించారు. అనంతరం కాకినాడకు ట్రాన్స్ ఫర్ కాగా, 1983 వరకు అక్కడ పనిచేశారు. ఆ కాలంలో కొలువు చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ప్రైవేటుగా బీఏ పట్టా పొందారు. అనంతరం ఎంఏ జాయిన్ అయ్యారు. ఏడాదిపాటు చదివి గుడ్ బై చెప్పేశారు. ఈ చదువులు, కొలువుల కారణంగా తనలో నిబిడీకృతమైన అఖండ సాహితీ సంపద..వెలుగు చూడడం లేదని భావించారో ఏమో..సాహిత్యరంగంపై దృష్టి సారించారు. సాహితీ లోకంలో భరణి అనే కలం పేరుతో ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి, విజయ తదితర పత్రికలకు కథలు, కవితలు పంపించారు. దాదాపు పది, పదిహేను కథలు రాశారు. అంతే..అప్పటి వరకు..ఎప్పుడెప్పుడు తన సన్నిధికి వస్తాడా..తన కీర్తిప్రతిష్ఠలను విశ్వవ్యాప్తం చేస్తాడా అని ఎదురు చూపులు చూసిన చలన చిత్రరంగం కోరిక నెరవేర్చడానికి సంసిద్ధం అయ్యాడు.

  కళా తపస్వి, సినీ వినీలాకాశంలో ఆదర్శనీయ, అనుసరణీయ అగ్రశ్రేణి దర్శకులు కాశీనాధుని విశ్వనాథ్ కంటికి ఈ సాహితీ కళా కోవిదుడు, అక్షర కుక్షి సరస్వతీ అమ్మవారి కటాక్షవీక్షణా దక్షుడు చేంబోలు సీతారామశాస్త్రి కనిపించాడు. సిరివెన్నెల సినిమాకు గేయ రచన చేయమని విశ్వనాథ్, చేంబోలును కోరారు. అంతే..ఆ సినిమాలోని పాటలన్నీ ఆణిముత్యలయ్యాయి. అనంతరం ఆయన ఇంటిపేరు, ఆయన ఇంట్లో వాళ్లకు తప్ప ఎవరికీ తెలియనంతగా మారిపోయింది. సిరివెన్నెల చిత్రం పేరే ఆయన ఇంటిపేరై పోయింది. అప్పటి నుంచి తెలుగు సినీ వినీలాకాశంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రయాణం ఓ చరిత్రగా మారింది. ఎన్నో చిత్రాల్లోని పాటలకు ఆయన ప్రాణం పోశారు.

  సిరివెన్నెల చిత్రంలో విధాత తలపున ప్రభవించినది పాటపై కురిసిన ప్రశంసల వర్షం అంతా ఇంతాకాదు. సీతారామశాస్త్రి గేయరచన చేసిన ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో నంది అవార్డ్ లభించింది. తొలి చిత్రంలోని పాటకే..నంది అవార్డు పొంది సిరివెన్నెల రికార్డ్ సృష్టించారు. 1986లో విడుదలైన సిరివెన్నెల సినిమాలో పాటలను సీతారామశాస్త్రి రాయగా..గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాన కోకిల పి.సుశీల గానం చేశారు.

  సమాజ రుగ్మతలను నిలదీయడంలో, దేశాభిమానాన్ని ప్రదర్శించడంలో, జాతీయ భావాన్ని పెంపొదించడంలో, జాతీయ సమగ్రత చాటడంలో, నిర్భయంగా సమాజ విద్రోహాలు ఎత్తిచూపడంలో..ఆయన కలం పరుగెట్టిన పరుగులను..ఇక ఏ ఇతర కవి కలం పరుగెట్టలేదేమో అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదని..చిత్రజగత్తు, వీక్షక, వీక్షణా జగత్తు ఏక కంఠంతో చెబుతోంది. 2021 నవంబర్ 30న సిరి వెన్నెల సాహితీకిరణం అస్తమించింది. సినీ సాహిత్య, సంగీత, కళా జగత్తు అంధకారబంధురంగా మారిపోయింది.

  పద సంపదతో స్వర సంపద చేకూర్చే క్రమంలో సంఘ విద్రోహులు, సమాజ విఘాతకులను ఎండగట్టడంలో..శ్రీకార, ఓంకారాల పక్కన ఘీంకార స్వరం వినిపించడంలోనూ, నిర్బయంగా లిఖించడంలో..రాజీ పడని సాహితీమూర్తి, సమతావాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నిగ్గదీసి అడుగు..సిగ్గులేని సమాజాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని అంటూ గాయమైన హృదయ ఆవేదనను అక్షరజ్వాలలుగా గాయం చిత్రంలో సంధించారు.

  ‘ఒప్పుకోవద్దు ఓటమి, వదులుకోవద్దు ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించ వద్దు నిర్ణయం’అని పట్టుదలగా ముందుకు సాగమన్న సిరివెన్నెల… ఒప్పుకోను ఓటమి అని పరువు, ప్రతిష్ఠ లో తేల్చేశారు. మహాత్మలో ఏం జరుగుతోందన్న ఈ నిండుపున్నమి రుద్రవీణలో చుట్టుపక్కల చూడొద్దన్నారు. సాహసం నా పథం అని మహర్షిలో చెప్పారు. శృతి లయల్లో తెల్లవారదేమి స్వామి అని.. తెల్లవారింది కళ్లు నులుపుకుని లేవండని కళ్ల సినిమాలో చిత్ర రచన చేశారు. సిరివెన్నెల్లో చందమామని పిలిచి, ఆదిభిక్షువును ఏం కోరేది అన్నారు. సూర్యవంశంలో నిశిరాత్రి చుక్కల కిలకిల గురించి తెలిపారు.

  ఓటమి ఒప్పుకోవద్దని పట్టుదలగా వుండమని, అనంతరం పరువు ప్రతిష్ఠలో ఒప్పుకోను ఓటమిని అనితేల్చిపారేశారు. మహాత్మలో ఏం జరుగుతోందని ప్రశ్నించి, రుద్రవీణలో చుట్టుపక్కల చూడవద్దన్నారు. మహర్షిలో సాహసం నా పథం అని చెప్పారు. ఇలా ఎన్నో గేయ రచనలు చేసి..అఖండ కీర్తి ప్రతిష్టలు పొందారు. ఈ సాహితీ కిరణం..తన సాహితీ సామ్రాజ్యాన్ని చిత్రజగత్తుకు, సాహితీ, స్వరప్రియ బాంధవులకు అప్పగించేసి 2021 నవంబర్ 30వ తేదీన..సినీవినీలాకాశం నుంచి గగనసీమలో ధృవతారగా ప్రకాశించడానికి వెళ్లిపోయారు.

  మిత్రులారా ఈ అంశాన్ని చూశారు కదా..! ఇక మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

  Trending Stories

  Related Stories