International

ఆఫ్గాన్, శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం..!

భారత్‎కు ప్రపంచ దేశాల్లోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులోనూ ఇతర దేశాలకు సాయం చేయడంలో ఎల్లపుడూ ముందే ఉంటుంది. అగ్రరాజ్యాలు అని చెప్పుకునే కొన్ని దేశాలు చేయలేని సాయం సైతం భారత్ అందిస్తోంది. తాజాగా తాలిబన్ల పాలిస్తున్న ఆఫ్గానిస్తాన్ కు భారత్ భారీ సాయం చేసింది.

అసలే ఉగ్రవాదులు అధికారంలో ఉన్న దేశంలో భారీ భూకంపాలు బీభత్సం సృష్టించాయి. అయితే తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న ఆఫ్గ‌నిస్తాన్ వైపు ఏ ఒక్క దేశం క‌న్నెత్తి చూడ‌డం లేదు. దీంతో ఆ దేశం నానా తంటాలు పడుతోంది. ఇప్ప‌టికే పాకిస్తాన్ చెప్పుడు మాట‌లు విని భార‌త్‎పై నోరు పారేసుకున్నా భార‌త దేశం ఎప్ప‌టి లాగే తన ధ‌ర్మాన్ని మ‌రిచిపోలేదు. త‌న విదేశాంగ విధానాన్ని మార్చుకోలేదు. తాలిబ‌న్లు త‌మ వైఖ‌రి మార్చుకునేలా చేసింది భార‌త్ . ఆ దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

ఇదే స‌మ‌యంలో తాజాగా ఆఫ్గ‌నిస్తాన్ లో వచ్చిన భారీ భూకంపంతో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎక్కువ‌గానే ప్రాణ న‌ష్టం సంభ‌వించి ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. వేలాదిగా ఇళ్లు, భ‌వ‌నాలు కూలిపోయాయి. భారీ ఎత్తున గాయ‌ప‌డ్డారు. కానీ సాయం చేసేందుకు ఆఫ్గ‌నిస్తాన్ దగ్గర వ‌న‌రులు లేవు. వ‌స‌తులు అంత‌క‌న్నా లేవు. ఇప్ప‌టికే ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ఆఫ్గ‌న్ల‌కు భార‌త దేశం త‌న వంతు సాయంగా గోధుమ‌ల‌ను పంపించింది. రెడ్ క్రాస్ సొసైటీ త‌న సేవ‌లు ప్రారంభించింది. ఈ త‌రుణంలో ఉగ్ర‌వాదం ఎన్న‌టికీ ఆమోద యోగ్యం కాద‌ని భార‌త్ స్ప‌ష్టం చేస్తూనే వ‌చ్చింది. తాజాగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌భుత్వం చేసిన విన్న‌పానికి మొద‌ట‌గా స్పందించింది భార‌త దేశం. ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన మందులు, ఆహార ప‌దార్థాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను విమానాల ద్వారా ఆఫ్గ‌నిస్తాన్ కు పంపించింది. ఇదే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు భార‌త దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి ఆరందిమ్ బాగ్చి. ట్విట్ట‌ర్ వేదిక‌గా భార‌త్ చేస్తున్న సాయాన్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మాన‌వ‌త్వాన్ని చాటుకున్న భార‌త్ కు ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌భుత్వం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

అటు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ మరో అడుగు ముందుకేసింది. భారత దౌత్యవేత్త శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో చర్చలు జరిపారు. భారత్ ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల రుణాలు, ఇతర సాయం అందించింది. తాజాగా మరింత సాయం అందించేందుకు శ్రీలంకకు భారత్ సూచనలు ఇచ్చింది. శ్రీలంక ఏడు దశాబ్దాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా నిత్యావసరాల దిగుమతికి విదేశీ మారకద్రవ్యం కొరత ఏర్పడింది. ద్వీప దేశమైన శ్రీలంక 22 మిలియన్ల మంది ప్రజలకు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి రాబోయే ఆరు నెలల్లో సుమారు 5 బిలియన్లు డాలర్లు కావాల్సి ఉంది.

శ్రీలంకలో ఎక్కడ చూసిన పొడవాటి క్యూలు దర్శనం ఇస్తున్నాయి. విద్యుత్ కోతలు మరింత తీవ్రం అయ్యాయి. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, కనెక్టివిటీ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సంవత్సరం శ్రీలంకకు విదేశీ సహాయానికి భారతదేశం ప్రధాన వనరుగా ఉందని… 4 బిలియన్ల డాలర్లకు పైగా సాయం అందించిందని ప్రధాని విక్రమసింఘే పార్లమెంటుకు చెప్పారు. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి శ్రీలంక ప్రయత్నిస్తున్నందున ఎరువులు, బియ్యం దిగుమతికి సాయం అందిస్తామని భారత దౌత్య అధికారులు తెలిపారు. 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు కొనసాగిస్తున్నందున, చైనా, భారత్, జపాన్‌లతో సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నామని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

15 − 11 =

Back to top button