ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరిగి అధికారంలోకి రాకుండా చేయడమే తమ పార్టీ మొదటి లక్ష్యమని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం నాడు చెప్పుకొచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని ఏ ఇతర రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు ఎంఐఎం. అయితే ఉత్తరప్రదేశ్ లో 100 సీట్లలో పోటీకి దిగనుంది ఎంఐఎం. ప్రజలు తాము పోటీ చేసే 100 సీట్లలో ఎన్ని చోట్ల గెలిపిస్తారో చూడాలని అన్నారు.
“బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడడమే మా మొదటి లక్ష్యం. రెండవది… కులం/మతం మధ్య వివక్ష చూపని వ్యక్తి/పార్టీ మాకు కావాలి” అని ఒవైసీ చెప్పుకొచ్చారు. తాము బీజేపీ బి-పార్టీ కాదని అన్నారు. యూపీలో మరే ఇతర రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని.. వంద సీట్లలో పోటీ చేస్తున్న తమ పార్టీ భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాష్ట్రంలోని మైనారిటీలను నిర్లక్ష్యం చేసినందుకు ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని అన్నారు. యూపీ ముఖ్యమంత్రిని తానేనని అఖిలేశ్ యాదవ్ నమ్మకంగా ఉన్నారని ఒవైసీ అన్నారు. యూపీలోని ముస్లింల దారుణ పరిస్థితికి ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తాకీర్ రజాఖాన్ వ్యాఖ్యల గురించి పూర్తిగా తెలుసుకున్నాక దానిపై బహిరంగంగానే స్పందిస్తానని చెప్పారు.
ఇక అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల్ల 9 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. ఘజియాబాద్ నుంచి డాక్టర్ మెహతాబ్, హాపూర్‌లోని గర్త్ ముక్తేశ్వర్ నుంచి పుర్కాన్ చౌదరి, హాపూర్లోని మరో నియోజకవర్గం ధౌలోనా నుంచి హాజీ ఆరిఫ్ బరిలో ఉన్నారు. ఇక మీరట్‌లోని సివాల్ ఖాస్ నియోజకవర్గం నుంచి రఫాత్ ఖాన్, సర్దనా నుంచి జీషన్ ఆలం, మీరట్ నుంచి కిథోర్, సహారన్ పూర్ నుంచి అమ్జాద్ అలీ బెహత్, బరేలీ-124 నుంచి షహీన్ రజా ఖాన్, సహారన్ పూర్ దేహత్ నుంచి మర్గూబ్ హసన్ బరిలో ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న నియోజకవర్గాలన్నీ ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాలే..! అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామన్నారు. ఇతర దశలకు మరింత మంది అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వర్చువల్ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. మొత్తం ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10 న విడుదల కానున్నాయి.