బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తప్పిన ప్రమాదం

0
261

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. జేపీ నడ్డా హారతి కోసం వచ్చిన సమయంలో సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ వినాయక మండపం పైభాగంలో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో వెంటనే జేపీ నడ్డాను సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాల్ దేవాలయం నమూనాలో రూపొందించిన గణపతి పండల్ పైభాగంలో మంటలు చెలరేగాయి. భద్రతా కారణాల దృష్ట్యా జేపీ నడ్డా పూజ మధ్యలోనే వదిలి బయటకు రావాల్సి వచ్చింది. మంటలు అంటుకున్న సమయంలో భారీ వర్షం కురవడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అంతకుముందు రోజు JP నడ్డా లాల్‌బాగ్చా రాజాతో సహా ముంబైలోని ప్రసిద్ధ గణేష్ పండళ్లను సందర్శించారు. ముంబై పర్యటనలో గిర్గావ్‌లోని కేశవ్‌జీ చాల్ గణేశోత్సవ్ మండలాన్ని సందర్శించారు జేపీ నడ్డా. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే తదితర ప్రముఖులతో కలిసి ఆయన లాల్‌బాగ్చా గణపతి దర్శనం చేసుకున్నారు.