హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న గ్రీన్ బావర్చి హోటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. భవనం లోపల ఎంతమంది ఉన్నారనే విషయం స్పష్టత లేకుండా పోయింది. అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భవనం పైకి ఎక్కిన కొందరు తమను రక్షించాలని కేకలు వేస్తున్నారు. దీంతో భవనం పైనున్నవారిని క్షేమంగా తీసుకురావడానికి ల్యాడర్‌ను పంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.