National

జావేద్‌ అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌పై ముంబై పోలీసులు సోమవారం నాడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్ దూబే ఫిర్యాదు మేరకు ములుంద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ సందర్భంగా సంతోష్‌ దూబే మాట్లాడుతూ ఇంతకు ముందు జావేద్‌ అక్తర్‌కు లీగల్‌ నోటీసు పంపానని, ఇందులో వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోరినట్లు తెలిపారు. ఆ నోటీసుకు ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు ములుంద్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఒకరు తెలిపారు.

జావేద్‌ అక్తర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ఐ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ‘తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోంది’ అన్నారు. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. జావేద్‌ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషత్‌ కూడా ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్లు మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో పోలికేమిటీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

అక్తర్‌ వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం దావాపై షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని థానే కోర్టు గతంలో ఆదేశించింది. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌, జాయింట్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వివేక్‌ చంపానేర్కర్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువునష్టం దావా దాఖలు చేశారు. 76 ఏళ్ల జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై పరిహారంగా ఒక రూపాయి చెల్లించాలని కోరుతూ వివేక్ చంపనేర్కర్ దావా వేశారు. అందులో భాగంగా థానే నగర అదనపు చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్, జాయింట్ సివిల్ జడ్జి జావేద్ కు షోకాజ్ నోటీసులు పంపించారు. జావేద్ అక్తర్ నవంబరు 12వతేదీన కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశించారు. అక్తర్ చేసిన ప్రకటనలు సామాన్య ప్రజల దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్ ఇమేజ్‌ని కించపరచడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. జావేద్ అక్తర్ చేసిన నిరాధారమైన, తప్పుడు ఆరోపణల వల్ల తమ పరువుకు నష్టం జరిగిందని, అందువల్ల అతను ఒక రూపాయిని పరిహారంగా చెల్లించాలని చంపానేర్కర్ కోరారు.

Related Articles

Back to top button