More

    కాంగ్రెస్ నేత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న మహిళ

    మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఉమంగ్ సింగార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన బంగళాలో 40 సంవత్సరాల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఐపీసీ సెక్షన్ 306(ఆత్మహత్య చేసుకోడానికి ప్రేరేపించడం) కింద ఆయన పై కేసు నమోదు చేశారు. ఆ మహిళకు, ఉమంగ్ సింగార్ కు మధ్య చోటు చేసుకున్న చాట్ హిస్టరీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళ కుమారుడి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రిజిస్టర్ చేసుకున్నారు. సింగార్ కు ఇప్పటికే పెళ్లి అయింది. అయినప్పటికీ విడాకులు తీసుకున్న సదరు యువతిని మాట్రిమోనీ వెబ్సైట్ లో కలుసుకున్నాడు. డిసెంబర్ 2020న ఆమెతో నిశ్చితార్థం కూడా అయ్యిందని తెలుస్తోంది.

    అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ బడోరియా మాట్లాడుతూ ‘ఉమంగ్ సింగార్ తన గంధ్వనీ నియోజకవర్గంలో పనులను చక్కబెడుతూ ఉండగా.. గత 20 రోజులుగా ఆమె ఎమ్మెల్యే బంగళా లోనే ఉంటోంది. ఆమెను భోపాల్ లో చాలా సార్లు ఉమంగ్ కలుసుకున్నారు. పంజాబ్ లోని ఆమె సొంత ఊరిలో కూడా సింగార్ ఆమెను కలుసుకునేవారు. ఇటీవల ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సింగార్ తో గొడవలు అవుతున్నట్లు చెప్పేది. అందుకే ఆమె డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయింది’ అని చెప్పుకొచ్చారు.

    షాపురా లోని ఉమంగ్ సింగార్ బంగాళాలో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించారు. ఆ బంగాళాలో పని చేసే వాళ్లు మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు తెలిపారు. ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మహిళకు చెందిన వస్తువుల నుండి సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. ఉమంగ్ సింగార్ కు కోపం ఎక్కువని, తనను ఏవీ ముట్టుకోనిచ్చేవాడు కాదని.. ఎన్నో విషయాల్లో తమ మధ్య క్లారిటీ అన్నది లేకుండా పోయిందని ఆమె రాసుకొచ్చింది. ఆ ఇంట్లో పని చేసే వాళ్లు, చనిపోయిన మహిళ తల్లి, కుమారుడి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.

    ఆమె కుమారుడి స్టేట్మెంట్:

    మహిళ 20 ఏళ్ల కుమారుడు సోమవారం నాడు అంబాలాకు చేరుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ తానెవరికీ భయపడనని నిజాలే చెబుతానని అన్నాడు. తన తల్లి సింగార్ ను మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా కలుసుకుందని తెలిపాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

    సింగార్ మొదటి భార్య:

    సింగార్ కు అప్పటికే పెళ్లి అయింది. ఆయనకు భార్యకు ఇద్దరు పిల్లలు. ఆమె ఇండోర్ లో నివసిస్తూ ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోలేదు.

    సింగార్ స్టేట్మెంట్:

    తాను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయానని సింగార్ చెప్పుకొచ్చారు. తాను పోలీసులతో కో ఆపరేట్ చేస్తూ ఉన్నానని.. ఈ విషయాన్ని దయచేసి రాజకీయం చేయకండని కోరారు. ఈ ఘటనపై నీచ రాజకీయాలు మానుకోవాలని కోరారు.

    Trending Stories

    Related Stories