అమెజాన్ పై కేసు నమోదు.. ఇలా ప్రింట్ చేసి వస్తువులు అమ్మడం ఎప్పటికి ఆపుతారో..!

0
947

షూలు, మగ్‌లు, టీ-షర్టులు వంటి వివిధ ఉత్పత్తులపై భారత జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఈ విషయమై కంపెనీకి నోటీసులు పంపుతున్నట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ మకరంద్ దేవస్కర్ తెలిపారు. మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా అమెజాన్ కంపెనీ, ఆ సంస్థ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించిన తర్వాత పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తులపై భారత జాతీయ జెండాను ఉపయోగిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. జాతీయ జెండాను బూట్లపై ఉపయోగించడం సహించరాని విషయమని ఆయన అన్నారు.

అమెజాన్‌పై CAIT ఫిర్యాదు:

మంగళవారం, భారత జాతీయ జెండాను అవమానించినందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ పై క్రూరమైన ఉల్లంఘన చోటు చేసుకుందని.. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని ఒక లేఖలో హోం మంత్రి అమిత్ షాను కోరారు.

CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ట్వీట్‌లో “నిరంతరం తప్పులు చేస్తూ ఉండే #amazon మరోసారి చట్టాన్ని ఉల్లంఘించింది. #అమెజాన్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని సెక్షన్ 2.1 (iv) & (v)ని ఉల్లంఘించినందుకు తక్షణ చర్య తీసుకోవాలని CAIT హోం మినిస్టర్ అమిత్ షాను కోరింది” అని చెప్పుకొచ్చారు.

ఖండేల్వాల్ మాట్లాడుతూ “ఇది తీవ్రమైన తప్పిదం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఉపయోగించిన తర్వాత పారవేయగల ఏదైనా ఉత్పత్తిపై జాతీయ జెండాను ముద్రించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయాన్ని గుర్తించి, కంపెనీపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మేము హోం మంత్రి షాను కోరాము” అని చెప్పుకొచ్చారు. అమెజాన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. మూడు సంవత్సరాల క్రితం అమెజాన్ లో వచ్చిన ఉత్పత్తులపై అప్పటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఛత్తీస్‌గఢ్ చాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ-కామర్స్ దిగ్గజంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జాతీయ జెండాపై ముద్రించిన ఉత్పత్తులను అమెజాన్ విక్రయిస్తోందని ఛత్తీస్‌గఢ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అమర్ పర్వాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాయ్‌పూర్ పోలీసులు అమెజాన్ అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. కంపెనీపై, గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.