More

    బీజేపీకి తాళాలు పంపించిన సమాజ్ వాదీ పార్టీ.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యూపీ పోలీసులు

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) బీజేపీకి రాజీనామా చేసిన కొందరు నేతలను ఇటీవల తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో ఎస్‌పీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్ లక్నోలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఓ తాళం కప్పను బహుమతిగా పంపించేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు. బీజేపీ నేత స్వతంత్ర దేవ్ సింగ్‌ చిరునామాకు ఈ ఆర్డర్‌ను పంపించాలని నిర్దేశించారు. పలువురు బీజేపీ నేతలు సమాజ్ వాదీ పార్టీలో చేరారని ఐపీ సింగ్ ఓ ట్వీట్‌లో చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఓ తాళం కప్పను పంపించానని తెలిపారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి 10న కార్యాలయానికి తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలని బీజేపీ నేత స్వతంత్ర దేవ్ సింగ్‌కు చెప్పారు. ఇది కేవలం ప్రభంజనం కాదని, ఎస్‌పీ తుపాను అని అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి, బీజేపీకి రాజీనామా చేసి మంగళవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

    యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌ ఆనందిబెన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. కార్మిక మంత్రిగా నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ యోగి కేబినెట్‌లో అంకిత భావంతో పని చేశానని అన్నారు. కానీ దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరగతి వ్యాపారుల్ని అణచివేస్తూ, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రోషన్‌ లాల్‌ వర్మ, బ్రజేష్‌ ప్రజాపతి , భగవతి సాగర్‌ వినయ్‌ శాఖ్యలు తాము మౌర్యకు మద్దతుగా పార్టీని వీడుతామని ప్రకటించారు.

    బీజేపీకి మౌర్య రాజీనామా చేయగా.. 24 గంటల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీ నుంచి వైదొలిగిన మరుసటి రోజే, ఏడేళ్ల నాటి కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మౌర్య దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 2014 కేసుకు సంబంధించిన అరెస్ట్ వారెంట్ అని తెలుస్తోంది. దీనిపై ఎంపి-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు జనవరి 24న విచారణ చేపట్టనుంది. మరో వైపు ఈ ఏడాది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు సిఎం యోగి ఆదిత్యనాథ్ అని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు దక్కవని భావిస్తున్న పలువురు నేతలు పార్టీలు మారేందుకు మొగ్గు చూపెడుతూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories