More

    నటుడు సోనూ సూద్ పై కేసు నమోదు

    నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లో కేసు నమోదైంది. ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో ఆయనపై మోగాలో కేసు నమోదైంది. సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్‌లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పోలింగ్ రోజున తన సోదరి కోసం సోనూ ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు.

    పంజాబ్‌లోని మోగాలోని పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకుండా ఎన్నికల సంఘం నిషేధించిన కొన్ని గంటల తర్వాత సోనూసూద్‌పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 20న, సూద్ తన స్వగ్రామమైన మోగాలో తిరుగుతూ కనిపించారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేశారనే ఆరోపణలపై ఆదివారం అర్థరాత్రి సోనూసూద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నైతిక ప్రవర్తనా నియమావళిని సూద్ ఉల్లంఘించారా లేదా అనే దానిపై పోలీసులు ECని సంప్రదించాలని కోరారు. పంజాబ్ పోలీసులు అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.

    ఆదివారం నాడు సోనూ సూద్, కొన్ని పోలింగ్ బూత్‌లలో డబ్బు పంపిణీ చేయబడిందని ఆరోపిస్తూ కొన్ని ప్రాంతాల్లో సొంతంగా తనిఖీ చేయడానికి ఇంటి నుండి బయటకు వచ్చారు. సోనూ సూద్ కు మోగాలో ఓటరు కాకపోవడంతో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. అక్కడ ఓటు హక్కు లేకుండా పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించడం, ఎన్నికలు జరుగుతున్నప్పుడు అతని సోదరి మాళవికా సూద్ సచార్ ప్రచారం చేస్తున్నట్లేనని చెబుతున్నారు. నివేదికల ప్రకారం సోనూ సూద్ లగ్జరీ SUV, ఫోర్డ్ ఎండీవర్‌ను పోలీసులు జప్తు చేశారు. ఎన్నికల అధికారులు సోనూ సూద్ ను ఇంట్లోనే ఉండమని ఆదేశించారు. మోగా సమీపంలోని లాండెకే గ్రామంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సూద్ ప్రయత్నిస్తున్నారని SAD నాయకులు ఫిర్యాదు చేయడంతో సూద్‌పై చర్యలు తీసుకున్నారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సోనూసూద్‌పై కేసు నమోదు చేసినట్లు మోగా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ దల్జీత్ సింగ్ తెలిపారు.

    Trending Stories

    Related Stories