మమతా బెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు జరిమానా విధించింది. నారదా కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరుపై సమాధానం ఇచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఇచ్చిన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయనందుకుగానూ మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వానికి రూ. 5 వేల జరిమానా విధించింది.
ఇద్దరు మంత్రులు సహా నలుగురు టీఎంసీ నేతలను మే 17న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులను నిరసిస్తూ సీబీఐ కార్యాలయంలో మమత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో దీదీ తీరుపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును హైకోర్టు విచారించి దీనికి సంబంధించి జూన్ 9న హైకోర్టుకు మమత, రాష్ట్ర న్యాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమాధాన పత్రాలను సమర్పించారు. తాము చెప్పిన సమయానికి కాకుండా ఇష్టం వచ్చినప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే తాము స్వీకరించబోమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు మమత తదితరులు ఇచ్చిన సమాధానాన్ని హైకోర్టు స్వీకరించకపోవడం చట్ట విరుద్ధం కాదని తెలిపింది. వీరి అఫిడవిట్లను రికార్డు చేయడంతో పాటు తొలి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్టును ఆదేశించింది. కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేసేందుకు అనుమతివ్వాలంటూ మమత హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును హైకోర్టు స్వీకరించింది. చెప్పిన సమయంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు మమత ప్రభుత్వానికి రూ. 5 వేల జరిమానా విధించింది.