మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫైన్

0
874

బుధవారం నాడు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కేటీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పద్మారావు నగర్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21 కిలోల కేక్ ను మంత్రి KTR కట్ చేశారు. ఇక టీఆర్ఎస్ ప్లీనరీ కోసం నగరం మొత్తం గులాబీమయం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లకు సంబంధించి తీవ్ర చర్చ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు ఫైన్లు వేశారు. ఫ్లెక్సీలకు సంబంధించి రెండు రోజుల్లో ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ట్విట్టర్ లో వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. జనం నుంచి వచ్చిన ఫిర్యాదులకు మాత్రమే ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు ఫైన్లు విధించారు. అత్యధికంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ.2 లక్షలకు పైగా ఫైన్ వేశారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. లక్షకు పైగా, మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు రూ.50 వేలకు పైగా ఫైన్లు వేశారని తెలుస్తోంది. ఈ ఫైన్స్ కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. గతేడాది అక్టోబర్ లో జరిగిన తెరాస విస్తృత స్థాయి సమవేశం సందర్భంగా కూడా పలువురు టీఆర్ఎస్ నాయకులకు జీహెచ్ ఎంసీ జరిమానాలు విధించింది.