More

  మణిపూర్‎లో రైలు కూత..!
  స్వాతంత్ర్య భారతంలో తొలిసారి..!!

  దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 74 ఏళ్లు గడిచాయి. మరో ఏడాదిలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం. కానీ, ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రజలకు రైలంటే ఏంటో తెలియదు. ఎన్డీఏ ప్రభుత్వం కృషితో ఎట్టకేలకు అక్కడ రైలు కూత వినిపించింది. మణిపూర్ రాష్ట్రానికి రైల్వే మ్యాప్‎లో చోటు కల్పించింది మోదీ సర్కార్. ట్రయల్ రన్‎లో భాగంగా.. రాజధాని ఎక్స్‎ప్రెస్ రైలు అసోంలోని సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి మణిపూర్‎లోని వెయింగైచున్‌పావో రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ట్రయల్ రన్ విజయవంతం కాగానే.. మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ట్విట్టర్‎లో వీడియో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఙతలు తెలిపారు. ట్రయల్ రన్ విజయవంతమైందని.. మణిపూర్ రాష్ట్రానికి ఇది చారిత్రక సందర్భమని.. సీఎం బీరేన్ సింగ్ ట్విట్టర్‎లో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ కల సాకారమైనందుకు.. మణిపూర్ ప్రజలు ఆయనకు కృతజ్ఙతలు చెప్పుకుంటున్నారని ట్వీట్ చేశారు.

  రైలు మణిపూర్ సరిహద్దుల్లోకి చేరుకోగానే స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మొదటి రైల్వే స్టేషన్ అయిన జిరిబమ్‎లో రైలు దిగిన రైల్వే అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. రైల్వే శాఖామంత్రి పియూష్ గోయల్ త్వరలోనే ఈ రైల్వే లైన్‎ను ప్రారంభించనున్నారు.

  ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధిలో భాగంగా.. మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరకు కొత్త రైల్వే లైన్‎ను నిర్మించారు. త్వరలోనూ పూర్తికానున్నా ఈ రైల్వే లైన్ మయన్మార్ బోర్డర్ దాకా విస్తరించనున్నారు. మయన్మార్ బోర్డర్ దగ్గర్లోని మోరేలో చివరి స్టేషన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం వెయింగైచున్ పావో నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంఫాల్ దగ్గర పొడవైన రైల్వే సొరంగ మార్గాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ కొత్త రైల్వే లైన్ మణిపూర్ నుంచి అసోంలోని సిల్చార్ ను అనుసంధానం చేస్తుంది. దీంతో స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడటమే కాకుండా.. వారి వ్యాపార అవసరాలను తీరనున్నాయి.

  మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలపై దృష్టిసారరించింది. గతేడాది 11,588 కోట్ల వ్యయంతో 1,044 కిలోమీటర్ల పొడవైన 29 సూపర్ క్రిటికల్ రైల్వే ప్రాజెక్టులను కేంద్రం ప్రభుత్వం పూర్తిచేసింది. నిజానికి, 39,663 కోట్ల వ్యయంతో 3,750 కిలోమీటర్ల నిడివి గల 58 సూపర్ క్రిటికల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. వీటిలో కేవలం ఏడాదిలోనై సగానికి పైగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇక, డిసెంబర్ 2021లోగా మరో 27 ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. మిగిలిన రెండు ప్రాజెక్టులు కూడా 2022 మార్చిలోగా పూర్తికావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఓవైపు కొవిడ్ 19 ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ప్రాజెక్టుల నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్న రైల్వే శాఖ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. వాయువేగంతో పనిచేస్తోంది.

  మొత్తానికి, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు కల సాకారం కావడంతో మణిపూర్ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరుగుబాటు, వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోయిన మణిపూర్ రాష్ట్రం ఇన్నాళ్లూ అభివృద్ధికి ఆమడదూరంలో వుంది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల చాలామంది వేర్పాటువాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో అక్కడ సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం యొక్క అవవసరం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో AFSPA యాక్ట్ ను తొలగించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్టు గత ఫిబ్రవరిలో సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు.

  అయినప్పటికీ, కొన్ని వేర్పాటువాద, మిలిటెంట్ గ్రూపులు మణిపూర్ మారుమూల ప్రాంతాల్లో ఉనికి చాటుకుంటున్నాయి. ఈశాన్యం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వారి దుర్మార్గపు ప్రణాళికల వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఏదేమైనా భారతీయ రైల్వే మణిపూర్ కు చేరుకోవడంతో ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి వేగవంతం కానుంది. ఇది తిరుగుబాటుదారులకు గొడ్డలిపెట్టు కానుంది.

  గత యూపీఏ పాలనాకాలంలో ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాలు గడిచినా.. మౌలిక సదుపాయాల కోసం మణిపూర్ రాష్ట్రం.. మోదీ ప్రభుత్వం ఏర్పడేదాకా వేచిచూడటం నిజంగా విచారకరం.

  Trending Stories

  Related Stories