నాలుగో టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50)ల రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (25), జస్ర్పీత్ బుమ్రా (24) కూడా రాణించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, రాబిన్సన్ 2, మొయిన్ అలీ 2, ఆండర్సన్ 1, రూట్ 1 వికెట్ తీశారు. లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన 263 పరుగులు. కావడంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకుంది.
ఈ టెస్టులో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి కీలకమైన 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ అద్భుతంగా రాణించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ధీటుగా ఆడుతున్నారు. వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది ఇంగ్లండ్. హమీద్ 43 పరుగులు, బర్న్స్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఆఖరి రోజు 291 పరుగులు కావాలి.. భారత్ కు 10 వికెట్లు కావాలి. పిచ్ మాత్రం బ్యాటింగ్ కు ఇంకా అనుకూలిస్తూనే ఉంది. ఆటకు చివరి రోజు టీమిండియా పేసర్ల దూకుడును తట్టుకుని ఇంగ్లండ్ ఏంచేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. మ్యాచ్ లో ఎలాంటి ఫలితం అయినా రావొచ్చు.
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్( వర్సెస్ న్యూజిలాండ్ , అహ్మదాబాద్, 2010); భువనేశ్వర్ కుమార్( వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్హమ్, 2014); వృద్ధిమాన్ సాహా( వర్సెస్ న్యూజిలాండ్, కోల్‌కతా, 2016) అంతకు ముందు ఈ రికార్డును అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి అవుట్ అయినట్లుగానే శార్దూల్ ఠాకూర్ కూడా అవుట్ అయ్యాడు.