అలిపిరిలో కొట్టుకున్న దళారులు

0
854

తిరుమల-తిరుపతిలో దళారుల వ్యవస్థను లేకుండా చేయడానికి గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎన్ని పాలకవర్గాలు మారినా కుదరడం లేదు. దర్శనం కోసం వచ్చిన వారి దగ్గర.. రూమ్స్, ప్రసాదాలు కావాలని అనుకునే వారి దగ్గర నుండి దళారులు పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తూ ఉంటారు. తాజాగా దళారుల మధ్య పెద్ద గొడవ జరిగిందని పోలీసులు ధృవీకరించారు. భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో తేడాలు రావడంతో దళారుల మధ్య దాడులకు దారితీసింది. డబ్బులు పంచుకునే క్రమంలో దాడులకు దిగారు. మాటామాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్ళింది. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు చేర్చే విషయంలో దళారుల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ గొడవల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచున్నట్లు వెల్లడించింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ దర్శన సమయంను పెంచింది టీటీడీ. ఇకపై రాత్రి 12 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించనుంది. రాత్రి 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. కరోనా కారణంగా గతేడాది లాక్ డౌన్ నుండి రాత్రి 9 గంటలకే ఏకాంత సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తూ వస్తున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటి వరకు చిత్తూరు వాసులకు మాత్రమే పరిమితం చేసిన సర్వదర్శనం టికెట్లను ఇప్పుడు అన్ని ప్రాంతాల భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 30,811 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 14,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరమ్మతులు, ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం టీటీడీ అధికారులు మూసివేయడంతో శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.