చైనాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏకంగా ఒక నగరం మొత్తాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ప్రపంచం మీదకు కరోనా మహమ్మారిని వదిలిందే చైనా అనే థియరీలను ప్రపంచ దేశాలు మొత్తం నమ్ముతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడుతూ ఉంటే.. చైనా మాత్రం అన్ని ఆంక్షలు ఎత్తేసి సాఫీగా గడిపింది. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని నగరాల్లో కరోనా కేసులు ఎక్కువ అవుతూ ఉండడంతో అధికారుల్లో కాస్త వణుకు మొదలైంది. ఫుజియాన్ ప్రావిన్స్‌లో తాజాగా 21 కరోనా కేసులు బయటపడడంతో ఏకంగా నగరం మొత్తాన్ని మూసేసింది. బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాలు, బార్లు, జిమ్‌లు ఇలా ప్రతి ఒక్కదానిని మూసేశారు. స్థానికులు ఎవరూ బయటకు వెళ్లకుండా.. బయటి వారు ఎవరూ నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే గత 48 గంటల్లో చేయించుకున్న కరోనా నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. తాజాగా కరోనా కేసులు పుంజుకున్న తర్వాత ఆదివారం నాడు తూర్పు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ ను COVID-19 హై-రిస్క్ ప్రాంతంగా వర్గీకరించబడింది. సెప్టెంబర్ 10 నుండి ఫుజియాన్ లో 21 కోవిడ్-19 కేసులు నివేదించబడ్డాయి. ఎక్కువగా జియాన్యు కౌంటీలో కేసులు వచ్చాయని చెబుతున్నారు. ప్రావిన్షియల్ హెల్త్ కమిషన్ ప్రకారం వైద్య పరిశీలనలో ఈ ప్రావిన్స్‌లో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫుజియాన్‌లో కొత్త కేసులు వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ బృందాన్ని ఫుజియాన్‌కు పంపింది.
జియాన్యు నివాసితులకు ఇంటి నుండి పని చేయాలని మరియు ప్రజా రవాణాలో మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం సూచించింది. పెద్ద సమావేశాలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. మ్యూజియంలు మరియు సినిమా థియేటర్లు వంటి కౌంటీలోని ఇండోర్ వినోద వేదికల కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. సూపర్ మార్కెట్లు మరియు ఇతర అవసరమైన సేవల విషయంలో కస్టమర్స్ సంఖ్యను పరిమితం చేయబడింది. కరోనా వ్యాప్తికి సంబంధించిన కేసుల విషయంలో వైరల్ జీనోమ్ సీక్వెన్సింగ్‌ని ప్రభుత్వం చేపట్టింది. చైనాను డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. రష్యా, మయన్మార్ నుంచి వస్తున్న వారిలోనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నట్టు అధికారులు గుర్తించారు.