కవలలను ఆయా చేతిలో పెట్టి ఉద్యోగాలకు వెళ్లారు.. ఆమె చేసిన పనికి వెంటిలేటర్ పై

0
708

పిల్లలను కన్నాక.. కొన్ని కొన్ని కారణాల వలన వారిని కేర్ టేకర్స్ చేతిలో ఉంచాల్సి ఉంటుంది. అయితే ఆ కేర్ టేకర్స్ కాస్తా మంచోళ్లయితే పర్వాలేదు.. అదే తమ శాడిజం మొత్తాన్ని పిల్లల మీద చూపిస్తే.. పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సూరత్‌ లో చోటు చేసుకున్న ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఒక మహిళా సంరక్షకురాలు (ఆయా లేదా బేబీ సిటర్) తెలియని కారణాల వల్ల ఎనిమిది నెలల పసికందును దారుణంగా కొట్టడం కనిపించింది. ఆ మహిళ పిల్లాడిని పరుపుపై వేసి ​​కూడా కొట్టింది. పాపని గిచ్చడం దగ్గర నుండి.. ఎన్నో దారుణాలకు పాల్పడింది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, మహిళను 2022 ఫిబ్రవరి 5న రాండర్ పోలీసులు అరెస్టు చేసి, హత్యాయత్నం IPC సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం 4 ఫిబ్రవరి 2022న అపస్మారక స్థితిలో ఎనిమిది నెలల పాప కనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కుటుంబ సభ్యులు అమర్చిన రహస్య కెమెరా ద్వారా చిత్రీకరించబడింది.

27 ఏళ్ల కోమల్ తాండేల్కర్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో స్పోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న మిథేష్ పటేల్ ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తోంది. మిథేష్ భార్య కూడా వర్కింగ్ ఉమెన్, ఆమె ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI)లో శిక్షకురాలు. వారిద్దరూ తమ ఉద్యోగాలకు వెళ్లడంతో, తమ కవల పిల్లలను చూసుకునేందుకు కోమల్ తాండేల్కర్‌ను ఆయాగా నియమించుకున్నారు. దంపతులు తమ తమ కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు చాలా ఏడుస్తున్నారని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. ఏమి జరుగుతోందో అనే అనుమానంతో మిథేష్ పటేల్ ఇంటి లోపల రహస్య కెమెరాను అమర్చాడు. కొద్దిరోజుల కిందట తన కవల పిల్లల శరీరాలపై చిన్న గాయాల గుర్తులను గమనించాడు. శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 నాడు కోమల్ తాండేల్కర్ పటేల్‌కు ఫోన్ చేసి, ఒక మగ శిశువు స్పృహతప్పి పడిపోయాడని తెలియజేసింది. పటేల్ పిల్లాడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

https://twitter.com/DeepikaBhardwaj/status/1492710469034938369

ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ బాలుడి మెదడుకు గాయం అయిందని.. వెంటిలేటర్‌పై ఉన్నాడని తెలిపారు. తాండేల్కర్ శిశువును మంచంపై ​​బలంగా కొట్టడంతో తలకు బలమైన గాయాలు అయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాలునికి ఏమి జరిగిందని తండ్రి నిందితురాలిని అడిగినప్పుడు ఆమె ఏమీ చెప్పలేదు. తర్వాత కెమెరా ఫుటేజీని పరిశీలించిన పటేల్‌కు చిత్రహింసల గురించి తెలిసింది. వైరల్ అయిన వీడియోలో, కోమల్ తాండేల్కర్ బాలుడిని కొట్టడం కనిపిస్తుంది. కవల పిల్లలను చూసుకోవాల్సిన సమయంలో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. నిందితురాలిపై పటేల్ రాండర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితురాలిని 2022 ఫిబ్రవరి 5న అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే చిన్న పిల్లలను ఎవరి చేతిలో పెట్టాలన్నా భయం వేస్తోంది.