అమెరికా మాజీ అధ్యక్షుడి హత్యకు కుట్ర..!

0
926

అమెరికా మాజీ అధ్యక్షుడి జార్జ్ డబ్ల్యు బుష్ హత్యకు కుట్ర జరిగిందా ? 2003 సంవత్సరం లో ఇరాక్ పై దాడికి ఆదేశించినందుకు బుష్ పై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి యత్నించారా? అంటే .. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఔననే సమాధానమే చెబుతోంది.

అమెరికాలోని కొలంబస్ ప్రాంతంలో ఉంటున్న షిహబ్ అహ్మద్ అనే ఇరాకీ వ్యక్తి ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. 2020 సెప్టెంబరు లోనే విజిటింగ్ వీసాపై అమెరికా కు వచ్చిన ఉగ్రవాది షిహబ్ అహ్మద్.. దాని గడువు ముగియడంతో కొత్త స్కెచ్ వేశాడు. 2021 మార్చిలో ఇరాకీ శరణార్థిగా అమెరికా లో ఉండేందుకు అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. నాటి నుంచి అతడిపై ఓ కన్నేసిన ఎఫ్ బీ ఐ మొత్తం బండారాన్ని బయటపెట్టింది. తాజాగా మంగళవారం షిహబ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టింది. గతంలో సద్దాం హుస్సేన్ హయాంలో ఇరాక్ సైన్యం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన మరో నలుగురిని మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకొచ్చేందుకు అతడు ప్రయత్నించాడని ఎఫ్ బీ ఐ తెలిపింది.

జార్జ్ బుష్ ఎక్కువగా రాకపోకలు సాగించే డల్లాస్, టెక్సాస్ సహా పలు ప్రాంతాల్లో షిహబ్ అహ్మద్ రెక్కీ నిర్వహించాడని పేర్కొంది. తుపాకులు, వాహనాలు ఎలా సమకూర్చుకోవాలి అనే దానిపై అతడు కసరత్తు చేశాడని వివరించింది. అమెరికా పోలీసుల దుస్తుల్లో వెళ్లి జార్జ్ బుష్ ను హత్య చేసేందుకు షిహబ్ పథక రచన చేశాడని ఎఫ్బీఐ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ను స్థాపించిన ఉగ్రవాది అబూ బకార్ ఆల్ బాగ్దాది కి తాను సోదరుడి వరుస అవుతానని ఒక ఎఫ్ బీ ఐ ఏజెంట్ కు షిహబ్ చెప్పాడు. ఖతర్ కేంద్రం గా కార్యకలాపాలు సాగించే అతివాద సంస్థ “ఆల్ రయిడ్” కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు కూడా బుష్ పై దాడిలో పాల్గొనేందుకు షిహబ్ కు సంసిద్ధత వ్యక్తం చేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈమేరకు వివరాలతో కొలంబస్ ఫెడరల్ కోర్టులో ఎఫ్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × four =