శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో శ్రీరామ్, ఈశ్వర్ అనే ఇద్దరు బాలలు బహిర్భూమికి వెళ్లిన కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. ఈశ్వర్ డెడ్ బాడీని జలాశయం వద్ద నుంచి ఇంటికి తీసుకువెళ్ళగా, శ్రీరామ్ ని నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు.
బాలుడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలని 108 వాహన సిబ్బందిని కోరగా.. నిబంధనలు అంగీకరించవు అంటూ వారు నిరాకరించారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు.. ఆటోలు, ఇతర వాహనాల వారిని బతిమాలినా.. ఎవరూ ముందుకు రాలేదు. గత్యంతరం లేక ద్విచక్ర ద్విచక్ర వాహనంపైనే శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఏప్రిల్ 26న తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగింది. హాస్పిటల్ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించడంతో ఓ తండ్రి కన్న కొడుకు మృతదేహంతో బైక్ పైనే 90కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. అన్నమయ్య జిల్లా చిట్వేల్ గ్రామానికి చెంది బాలుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి రుయాలో చికిత్స కోసం చేరాడు. ఈ క్రమంలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అయితే కొడుకు మృతదేహాన్ని తరలించడానికి హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్లను బాలుడి తండ్రి సంప్రదించగా మృతదేహాన్ని తరలించడానికి రూ.20వేలు డిమాండ్ చేసారు.
అంత డబ్బు ఇచ్చుకోలేక అతడు హాస్పిటల్ బయట ఓ అంబులెన్స్ ను తక్కువ రేటుకు మాట్లాడుకున్నాడు. అయితే, హాస్పిటల్ లోని అంబులెన్స్ సిబ్బంది దీన్ని పడనివ్వలేదు. బయటి అంబులెన్స్ ను హాస్పిటల్ లోపలికి రానివ్వకపోకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఇలా ఓవైపు కొడుకు మృతిచెందడంతో పుట్టెడు దు:ఖంలో వున్న ఆ తండ్రికి హాస్పిటల్ సిబ్బంది మరింత వేధించారు. హాస్పిటల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్ల నిర్వాకంతో దిక్కుతోచని పరిస్థితితో కుమారుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తీసుకెళ్లాడు.
కాగా, దీనిమీద ఏప్రిల్ 26న ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ కి చెందిన బాలుడి డెడ్ బాడీని తీసుకెళ్లడానికి రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. బయటి నుండి మరో అంబులెన్స్ ను రప్పించినా కూడా ఆ అంబులెన్స్ డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో కొడుకు డెడ్ బాడీని తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు.
ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో మంత్రి విడుదల రజని ఈ విషయమై రుయా ఆసుపత్రి సూపరింటెండ్ తో మాట్లాడారు. మృతదేహంతో వ్యాపారం చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. మహా ప్రస్థానం అంబులెన్స్ లు 24 గంటలు పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకు వస్తామన్నారు. ఆసుపత్రుల్లో ప్రైవేట్ అంబులెన్స్ లను నియంత్రిస్తామని మంత్రి విడుదల రజని హామీ ఇచ్చారు.