More

  కూతురిని అమ్మేసిన తండ్రి.. తృణమూల్ కాంగ్రెస్ నేత గ్యాంగ్ రేప్

  పశ్చిమ బెంగాల్ లో ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో దారుణ ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. గిరిజన బాలికను సొంత తండ్రే అమ్మేశాడు. బాధితురాలిని ఆమె తండ్రి అమ్మిన తర్వాత.. బాలికపై TMC నాయకుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్‌లోని సియాన్ ములుక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

  ఈ కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ సభ్యుడు దీప్తిమాన్ ఘోష్, బాధితురాలి తండ్రి సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, బాధితురాలి తండ్రి TMC నాయకుడి నుండి ₹ 1 లక్ష రూపాయలకు పైగా అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక ఈ ఏడాది మార్చి 31న మైనర్ కుమార్తెను ఘోష్ కు అప్పగించాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన నిందితులు, అతని సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

  TV9 బంగ్లా నివేదిక ప్రకారం, బాలికపై మొదట మార్చి 31 న స్థానిక యువకులు అత్యాచారం చేశారు, వారు సైలెంట్ గా ఉండాలని బాధితురాలిని భయపెట్టారు. ఆనందబజార్ పత్రిక ప్రకారం స్థానిక యువకుడు మరెవరో కాదు, TMC నాయకుడు దీప్తిమాన్ ఘోష్ అని తేలింది. బాలిక బుర్ద్వామన్‌లోని తన అత్త ఇంటికి వెళ్లి చికిత్స తీసుకుంది. అవమానాలకు భయపడి బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. బోల్పూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ఆమెపై మళ్లీ TMC నాయకుడు, మరో ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. టీవీ9 బంగ్లా, ఆనందబజార్ పత్రిక రెండూ కూడా ఈ దారుణంలో బాలిక తండ్రి ప్రమేయం ఉన్నట్లు నివేదించాయి.

  బాధితురాలు తన సోదరికి తనపై జరిగిన దారుణాన్ని వివరించి, బోల్పూర్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చింది. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376D (గ్యాంగ్ రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం, 2012 (POCSO)లోని సంబంధిత సెక్షన్‌ల కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయబడింది. నిందితులను స్థానిక కోర్టు బుధవారం (ఏప్రిల్ 13) పోలీసు కస్టడీకి పంపింది. ఎస్పీ (బీర్‌భూమ్) నాగేంద్రనాథ్ త్రిపాఠి మాట్లాడుతూ “ఈ దారుణంపై దర్యాప్తు జరుగుతోంది. పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అమ్మాయి ఇప్పుడు ఆసుపత్రిలో చేరింది.” అని తెలిపారు. తృణమూల్ నాయకుడు మాత్రం.. నన్ను కేసులో తప్పుగా ఇరికిస్తున్నారు. నేను నిర్దోషిని అని అంటున్నాడు.

  బాలికను మొదట బోల్పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు, ఆ తర్వాత కోల్‌కతాలోని సేథ్ సుఖ్‌లాల్ కర్నానీ మెమోరియల్ హాస్పిటల్ (SSKM)కి బదిలీ చేశారు.

  Zee24 నివేదిక ప్రకారం ఈ దారుణమైన ఘటనల కారణంగా బాధితురాలు కృంగి పోయింది. తన కష్టాల గురించి మాట్లాడలేకపోయిందని, ఆమెకు అందించిన ఆహారం తినడానికి కూడా నిరాకరించిందని తెలుస్తోంది. బాధితురాలి మానసిక, శారీరక స్థితిని పరిశీలించడానికి ఆసుపత్రి అధికారులు మానసిక వైద్యుడు, గైనకాలజిస్ట్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం (ఏప్రిల్ 12) రాత్రి బాధితురాలి అధిక రక్తస్రావాన్ని ఆపేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

  Trending Stories

  Related Stories