83 రోజుల పోరాటం సమాప్తం.. లొంగిపోయిన 1000 మంది అజోవ్ ఫైటర్స్

0
814
A still image taken from a video released by Russian Defence Ministry shows what it claims are service members of Ukrainian forces, who left the besieged Azovstal steel plant, being searched by the pro-Russian military in Mariupol, Ukraine. Video released May 17, 2022. Russian Defence Ministry/Handout via REUTERS

మారియుపోల్ నగరం రష్యా హస్తగతమైంది!. 83 రోజులపాటు పోరాడిన ఉక్రెయిన్ సైనికులు..రష్యన్ బలగాలకు లొంగిపోయారు. వీరిని రష్యా సైన్యం రహస్య ప్రదేశానికి తరలించింది. నగరంలోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణ బంకర్లలో తలదాచుకుంటూ..ఇన్నాళ్లు పుతిన్ సేనలను ఎదురుస్తూ వచ్చారు. ఉక్రెయిన్‌ సైనికుల్లో దాదాపు 1000 మంది లొంగిపోయినట్లు గా తెలుస్తోంది. మారియుపోల్ విజయం..క్రిమియాకు ఎంతో ముఖ్యం.

మారియుపోల్ నగరం రష్యాకు అనేక విధాలుగా చాలా ముఖ్యమైనది. నిజానికి క్రిమియాలో స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. వారు తాగునీటిని మారియుపోల్ గుండా ప్రవహించే నది నుండి పొందేవారు. కానీ 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత ఉక్రెయిన్ ఈ నది జలాలను కాలువ ద్వారా క్రిమియాకు వెళ్లకుండా అడ్డుకుంది. అప్పటి నుంచి అక్కడ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఇప్పుడు మారియుపోల్ స్వాధీనంతో, క్రిమియాలో మంచినీటి సమస్య శాశ్వతంగా ముగుస్తుంది. క్రిమియాకు భూమార్గం ద్వారా చేరుకోవాలంటే మారియుపోల్ లేదా డాన్‌బాస్‌ గుండా వెళ్లాల్సి ఉంటుంది. రష్యా ఇటీవల స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన లుహాన్‌స్క్‌, డోనెట్‌స్క్‌ ప్రాంతాలు.. డాన్‌బాస్‌లోనే ఉన్నాయి. సముద్రం ద్వారా ఈ రెండు ప్రాంతాలకు సైన్యాన్ని పంపడానికి మారియుపోల్ ఓడరేవు నగరం ఒక ముఖ్యమైన గేట్‌వే.

ఉక్రెయిన్ మారియుపోల్ ద్వారా మాత్రమే సముద్ర వాణిజ్యం చేసేది. ఇక్కడ నుండి దాని నౌకాదళం పనిచేసింది. ఈ నగరాన్ని ఇప్పుడు రష్యా ఆక్రమించడంతో ఉక్రెయిన్ వాణిజ్యం, నౌకదళ కార్యకలాపాలు ఇక నిలిచిపోయినట్లే. ఈ మూడు కారణాల వల్ల, రష్యా సైన్యం గత 3 నెలలుగా మారియుపోల్‌పై దాడులు చేస్తుంది. భారీ ఆయుధాలు, పెద్ద సంఖ్యలో సైనికులను తరలించి యద్ధం చేస్తోంది. అయితే నగరం వెలుపల దాదాపు 11 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న స్టీల్ ప్లాంట్ వారికి ఇబ్బందిగా మారింది. సోవియట్ కాలం నాటి డజన్ల కొద్దీ సొరంగాలు ఈ ప్రాంతంలోనే ఉండటం విశేషం. ఇందులో ఉక్రేనియన్ సైనికులు రహస్యంగా ఉంటూ.. పుతిన్ సేనలను ఇన్నాళ్లు నిలువరించారు.

ఆయుధాలు, మందు, రేషన్ అన్నీ అయిపోయిన తర్వాత లొంగిపోవడం తప్ప ఉక్రెయిన్ సైనికులు ముందు మరో మార్గం లేదు. అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సైనికులు లొంగిపోవడాన్ని ధైర్యానికి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఆయన అజోవ్ బెటాలియన్‌ను అనేక వందల సంవత్సరాల క్రితం పర్షియన్ సైన్యంతో పోరాడిన స్పార్టన్ సైనికులతో పోల్చాడు. లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికులను.. రష్యా సైనికులు వారి బస్సుల్లో తమ ఆక్రమిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటనే దానిపై స్పష్టత లేదు. నిజానికి ఇరు దేశాల మధ్య చర్చలు దాదాపుగా ముగిశాయి. అయితే, టర్కీ మధ్యవర్తిత్వంతో, పట్టుబడిన సైనికులను మార్పిడి చేసుకునేలా రష్యాను ఒప్పిస్తారని ఉక్రేనియన్ నాయకులు భావిస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here