National

రైతు ఆందోళనల్లో విధ్వంసానికి పాక్ ఐఎస్ఐ ప్లాన్..!

రైతు చట్టాల ఆందోళనల్లో చేరిన దేశవిద్రోహ శక్తులు ఎంత విధ్వంసం సృష్టించాయో ఇప్పటికే చూశాం. జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన విధ్వంసంలో వేర్పాటువాద ఖలిస్తానీల పాత్ర ఉన్నట్టు తేలిపోయింది. టూల్ కిట్లు రూపొందించుకుని మరీ.. విపక్షాల మద్దతుతో ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇప్పుడు రైతు నిరసనల ఆసరాగా చేసుకుని.. దేశంలో విధ్వంసం సృష్టించేందకు పాకిస్తాన్ పన్నిన కుట్ర తాజాగా వెలుగుచూసింది.

ఏడు నెలలుగా సాగుతున్న రైతు చట్టాల వ్యతిరేక ఆందోళనలకు గుర్తుగా.. అన్ని రాష్ట్రాల్లో ‘చలో రాజ్‎భవన్’కార్యక్రమం చేపట్టాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గవర్నర్లను కలిసి వినతి పత్రాలు అందజేయాలని కోరారు. ఇక, ఆందోళనలకు ఈ నేప‌థలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం పశ్చిమ యూపీ, పంజాబ్‌ల‌ నుంచి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లపై రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకోనున్నార‌ని తెలుస్తోంది.

అయితే, రైతుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. రైతుల నిరసనల్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. రైతుల్లో చేరి పోలీసులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించే అవకాశం ఉందన్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

ముఖ్యంగా జనవరి 26న జరిగిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా.. కేంద్ర నిఘా విభాగం ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రైతుల ఆందోళన కార్యక్రమాల్లో పాకిస్తాన్ ఆధారిత వ్యక్తులు విధ్వంసానికి కుట్ర పన్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఢిల్లీ పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను హెచ్చరించాయి. ఢిల్లీలోని విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో రైళ్లలో విధ్వంసానికి పాల్పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా విభాగం ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది.

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఢిల్లీ ఎల్లో లైన్ మార్గంలోని విశ్వవిద్యాలయం, సివిల్ లైన్స్, విధానసభ మెట్రో రైల్వే స్టేషన్లను ముందుజాగ్రత్తగా మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మెట్రో స్టేషన్ల వద్ద సాయుధ పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం చుట్టూ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని తిక్రీ, సింఘు, ఖాజీపూర్ ప్రాంతాల్లో గతేడాది నవంబర్ నుంచి అంటే ఏడు నెలలుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. దీంతో రైతులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే భారతదేశం అంతటా రైతులు ఆయా రాష్ట్రాల్లోని రాజ్‌భవన్ వరకు ర్యాలీ చేపట్టాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్లకు వినతిపత్రం సమర్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్ అఖిల భారత అధ్యక్షుడు నరేష్ తికాయత్ కూడా ఈ పిలుపునకు మద్ధతు ప్రకటించారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలల రైతుల ఆందోళన పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు మెమోరాండమ్‌ ఇవ్వనున్నట్లు తికాయత్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × 2 =

Back to top button