భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ, రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు కోరుకోవడం లేదని, విదేశాలలో ఆయన ప్రతిష్టను దిగజార్చడం రైతులకు ఇష్టం లేదని అన్నారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని రైతులెవరూ కోరుకోలేదని, విదేశాల్లో మన ప్రధానికి ఉన్న పరపతిని, ఇమేజ్ ను దెబ్బతీయాలనే ఆలోచన రైతులకు లేదని చెప్పారు. ఏ నిర్ణయాన్నైనా రైతుల ఆమోదం లేకుండా తీసుకోవద్దని మాత్రమే తాము ప్రధానిని కోరుతున్నామని తెలిపారు. దేశం కోసం తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నామని… అయినప్పటికీ ఢిల్లీ మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని కూడా అవమానించేలా ఉన్నాయని అన్నారు. తన వ్యాఖ్యలపై నరేంద్ర సింగ్ తోమర్ వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశమే లేదని చెప్పారు. “మేము వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాము. కొంతమందికి ఇది ఇష్టం లేదు. కానీ ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి తీసుకున్నాము. మేము మళ్లీ ముందుకు సాగుతాము.. ఎందుకంటే రైతులు భారతదేశానికి వెన్నెముక. రైతులు బలంగా ఉంటే దేశం బలపడుతుంది.” అని అన్నారు.
“ప్రధాని క్షమాపణలు చెప్పడం మాకు ఇష్టం లేదు.. విదేశాల్లో ఆయన పరువు తీయకూడదని.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే రైతుల సమ్మతి లేకుండా జరగదని.. మేం నిజాయితీగా పొలాల్లో సాగు చేసినా ఢిల్లీ సొమ్ము ఇవ్వలేదు. మా డిమాండ్లపై శ్రద్ధ వహించండి” అని రాకేశ్ టికాయత్ ట్వీట్ కూడా చేశారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం తిరిగి ప్రవేశపెడితే ఆందోళనను పునఃప్రారంభిస్తామని రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. మూడు వ్యవసాయ చట్టాలను నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారు. నవంబర్ 23న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుల రద్దును ఆమోదించారు.
మథుర నగరంలో శాంతికి విఘాతం కలిగించాలనుకునే కొన్ని శక్తులను అనుమతించవద్దని రాకేశ్ టికాయత్ ప్రజలను హెచ్చరించారు. ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా.. కొందరికి ఓట్లు పడవు కాబట్టి.. ప్రజలు శాంతియుతంగా ప్రార్థనలు చేసి సాధారణ జీవనం సాగిస్తుండడం వారికి నచ్చదు.. అందుకే నగర శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మథుర వాతావరణాన్ని పాడు చేయాలనుకునే వ్యక్తుల ప్రయత్నాన్ని భగ్నం చేయాలని, ఇలాంటి అంశాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.