కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రైతు నేతలు రాకేష్ టికాయత్, యుధ్వీర్ సింగ్‌లపై కొందరు నలుపు రంగు సిరాను విసిరారు. ఇటీవల కర్ణాటకకు చెందిన రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్ డబ్బులు అడుగుతూ ఓ ప్రాంతీయ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. ఆ వీడియోపై మాట్లాడుతూ ఉండగా.. రైతు సంఘాల నేతలు రాకేష్ టికాయత్, యుధ్వీర్ సింగ్ లపై కొందరు ఇంక్ విసిరారు. విలేకరుల సమావేశంలో కొంత మంది వాగ్వాదానికి దిగి వారిపై నల్ల ఇంకు విసరడమే కాకుండా.. కుర్చీలను కూడా విరగ్గొట్టారు. ఇంకు పడగానే ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ, కుర్చీలను విసురుకున్నారు.
ఈ ఘటనపై టికాయత్ స్పందించారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులతో తనకు భద్రత ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయిన కొన్ని శక్తులే ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులే బాధ్యత వహించాలని ఆరోపించారు. తమకు అసలు భద్రత లేదని, ఈ నిరసనలకు కర్ణాటక ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని అన్నారు.