‘కేంద్రం ఏం చేసినా పర్వాలేదు. ఈ స్థలాన్ని శ్మశానాల దిబ్బగా మార్చినా భయపడేది లేదు. ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ శపథం చేశాడు. ముజఫ్ఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ బహిరంగ సభకు హాజరైన రాకేశ్ తికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ముజఫర్‌నగర్ లో మహాపంచాయత్ లో రైతు సంఘాల నేతలు ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ సంఘం నేత రాకేశ్ తికాయత్ ‘‘అల్లాహో అక్బర్, హరహర మహదేవ్, జో బోలే సో నిహాల్’’ అని మూడు మతాలకు చెందిన నినదించారు.
రాకేశ్ తికాయత్ అచ్చంగా నిజమే చెప్పారు. జూనియర్ తికాయత్ మాత్రమే కాదు, ఆయన తండ్రి మహేంద్ర సింగ్ తికాయత్ 33 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బోట్ క్లబ్ లో హుక్కా తాగుతూ సర్కార్ కు హుకూం జారీ చేసినపుడు కూడా సత్యమే పలికారు. వారు కాలుపెట్టిన తర్వాత ఆ నేల మరుభూమిగా మారిన తర్వాత మాత్రమే వారు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు.
భారతదేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే తికాయత్ కుటుంబానికి ఒక ప్రాశస్థ్యం ఉంది. ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి. ‘అన్నదాత’ను సొమ్ము చేసుకోవచ్చనే ‘’economy of Movements” ఫార్ములాను మొట్టమొదట కనిపెట్టి, దాన్ని కార్యక్షేత్రంలో పరీక్షించి విజయవంతమైన కుటుంబం తికాయత్ లది. అందుకే రాకేశ్ తికాయత్ కు ప్రతినెలా అందే ఆదాయం సుమారు 50లక్షలు. జూనియర్-సీనియర్ తికాయత్ లు మాత్రమే కాదు, అనేక మంది ఉద్యమ నేతలు, వామపక్ష పార్టీలు ఇవాళ వందల కోట్ల ఆదాయం ఉన్న సంస్థలుగా తర్జుమా అయ్యాయి
మన దేశంలో కార్మిక-కర్షక ఉద్యమాలు మొదలైనపుడు పరిస్థితి ఎలా ఉండేది? ఆ తర్వాత ఉద్యమ సంస్థలు ఆర్థిక దిగ్గజాలుగా ఎలా మారాయి? సీనియర్-జూనియర్ తికాయత్ లు రైతు ఉద్యమాలను ఎలా కెరీర్ గా మార్చుకున్నారు? దేశంలోని వామపక్ష పార్టీల ఆదాయాలు నిజంగానే పెరిగాయా? ఢిల్లీలో ‘వంద ఏళ్ల రైతు ఉద్యమం’ పండగను సెలెబ్రేట్ చేసుకున్న ఆందోళనలకు నాయకత్వం వహించిన నేతల ఆస్తులెన్నో తెలుసా? 1907లో జరిగిన రైతాంగ ఉద్యమానికి ఇవ్వాళ్టి ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా?
ఇలాంటి సీక్రేట్స్ ను ఛేదిద్దాం..
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో సరికొత్త రాజకీయ చర్చకు ఆవకాశం కల్పించాయి. ఎన్నికల ఫలితాలు ఎలా పార్టీల నిజస్వరూపాలు, నేతల లీలలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఢిల్లీ ఆందోళనలు సుదీర్ఘకాలం సాగేందుకు కారణం ఏంటి? దానికి ఏం వ్యూహం దాగుంది అనే ఆసక్తికరమైన చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి.
ఏ దేశంలో అయినా ‘‘ఎన్నికల ప్రక్రియ’’ ఒక గొప్ప పొలెమికల్ డిబేట్ కు సందర్భాన్ని సృష్టిస్తాయి. ఈ చర్చల్లో నేతల రంగులు బయటపడతాయి. రకరకాల మార్గాల్లో రాజకీయ పార్టీలకు తాబేదార్లుగా పనిచేసే ప్రభావశీలమైన వ్యక్తులు, ఉద్యమ ముసుగు ముఖాల వెనుక జరిగే రహస్య కార్యకలాపాలు బట్టబయలవుతాయి.
భారత దేశ చరిత్రలో ‘రైతు ఉద్యమాల’ పేరుతో మూడు దశల్లో జరిగిన ఆందోళనల పరంపరను గమనిస్తే.. రెండు, మూడో దశలో సాగిన రైతు ఆందోళనలు తర్వాత ఎలాంటి రూపం తీసుకున్నాయో, రాజకీయ పార్టీలకు ఉద్యమాల నేతలు ఎలా దళారులుగా సేవలందించారో స్పష్టంగానే గమనించవచ్చు.
1950 నుంచి 1970 వరకు జరిగిన రైతాంగ ఆందోళనలు వాస్తవికతను ధ్వనించాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వెలిబుచ్చాయి. వాటిని ప్రభుత్వాలు పరిష్కరించాయి అనడం కన్నా, వినయంగా విన్నాయి. ఇక 1970-90 వరకు జరిగిన ఉద్యమాలు క్రమంగా కనిపించని అవినీతి తెరల వెనక్కి చేరిపోయాయి. ఆందోళనలను కూడా ‘పరపతి’గా మార్చుకోవచ్చన్న సృహ కలిగింది. ఇక తొంభైల తర్వాత ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ‘చెలామణి’ పెరగడంతో ఆ ప్రభావం ఉద్యమ సంస్థలపై కూడా పడింది. అక్కడి నుంచి ఎన్జీఓలు, వామపక్ష పార్టీలు, విశ్వవిద్యాలయాలు కేంద్రంగా పనిచేసే విద్యార్థి సంఘాలకు భారీ ఎత్తున డబ్బు సమకూరుతూ వచ్చింది.
అంతగా అవగాహన లేని వారు కేవలం కాసులకు ఆందోళనలను తాకట్టు పెట్టారు. మరికొంత మంది వేరు వేరు రూపాల్లో సాయాలు పొందారు. అయితే 90ల తర్వాత దేశంలో అప్పటికే జరుగుతున్న పారిశ్రామికీకరణకు పీవీ ఆర్థిక సంస్కరణలు తోడవ్వడంతో ‘ఉద్యమాల’ ఆదాయ మార్గాలు పెరిగాయి. రైతు సంఘాలకు తోడు ట్రేడ్ యూనియన్ వేదికలు నెలకొల్పేందుకు అవకాశాలు ఎక్కువ ఏర్పడ్డాయి.
అంతకు ముందే ట్రేడ్ యూనియన్లు ఉన్నా…వాటి దృష్టి పెద్దగా వ్యాపారం కాదు. పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో వామపక్ష శక్తులు, ఇతర స్వతంత్ర ఉద్యమ నేతలకు కొత్త దారులు దొరికాయి. బొంబాయి నగరం ట్రేడ్ యూనియన్ చరిత్రను పరిశీలిస్తే..ఉద్యమాలు ఎలా వ్యాపార కేంద్రాలుగా మారతాయో అర్థమవుతుంది.
1997లో బొంబాయి ట్రేడ్ యూనియన్ నేత దత్తా సామంత్ కాల్చివేత ఉదంతాన్ని, దాని పూర్వాపరాలను అధ్యయనం చేస్తే ఉద్యమాలు ఎలా వ్యాపార సంస్థలుగా తర్జుమా అయ్యాయో తెలుస్తుంది. పూర్వ మధ్య ప్రదేశ్ లో ట్రేడ్ నాయకుడు శంకర్ గుహా నియోగి హత్యోదంతం ఈ కోవలోనే అధ్యయనం చేయాల్సిన అంశం. నియోగి 1991లో భిలాయ్ లో హత్యకు గురయ్యాడు.
Ntional election watch సంస్థ ‘‘Analysis of Total Income and Total Assets of major Political Parties for A.Y. 2006-2007 to 2011-2012’’ ఓ నివేదికను ప్రచురించింది. 2006-07 నాటికి సీపీఐ(ఎం) ఆదాయం 41.6 కోట్లు అదే 2012 వచ్చే సరికి 377.38 కోట్లుగా మారింది. వ్యాపార సంస్థలకు ఆదాయం వచ్చిందంటే అర్థం ఉంటుంది. ఉద్యమాలే ఊపిరిగా, త్యాగనిరతితో పనిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న పార్టీలు, సంస్థలు, వ్యక్తుల ఆస్తులు ఈ స్థాయిలో ఎలా పెరుతాయో అర్థం కాదు.
‘‘కర్షకుడు కార్మికుడు కలిస్తే కాసుల వర్షం, లేదంటే పదవుల పందేరం’’ అనే సూత్రాన్ని మన దేశంలో తికాయత్ లాంటి నేతలు, వామపక్ష పార్టీలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. లేనిపోని మాటలు చెప్పి, అమాయక జనాన్నిపోగేసి పార్టీల అధికారం కోసం తాకట్టు పెట్టే సంస్కృతికి శిఖరాయమాన ఉదాహరణ ఢిల్లీ రైతుల ఆందోళన.
ప్రభుత్వం సంస్కరించిన చట్టాల్లో లోపాలు ఉండవచ్చు. వాటిని సంస్కరించాల్సిన అవసరమూ ఉండవచ్చు. లేదూ ప్రభుత్వాలు వాటిని హడావిడిగా తెచ్చిన సందర్భాల్లో సరైన అవగాహన కల్పించాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు. వీటన్నిటిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. కానీ, పేద రైతులకు అబద్ధాలు చెప్పి, ఎండకు మాడ్చి, వానకూ నాన్చీ, చలి కొరడాల పాలు చేసి పబ్బం గడుపుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి?
ప్రతినెలా 50 లక్షల ఆదాయం ఉన్న తికాయత్ కు ఢిల్లీ రైతుల ఆందోళనలు ఒక అపూర్వ అవకాశం. 2024 సాధారణ ఎన్నికల మార్కెట్ లో ‘ఢిల్లీ కిసాన్ ఆందోళన్’ బ్రాండ్ ను ఆయన మంచి బేరానికే అమ్ముకోవచ్చు. మహేంద్రసింగ్ సింగ్ తికాయత్ గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ గతేడాది డిసెంబర్ 20న ‘‘Thirty-two winters ago, the hookah, the hukumat’’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘‘For a week beginning October 25, 1988, nearly 500,000 farmers took over the heart of the Capital, occupying Boat Club and its lawns, within earshot of North and South Blocks, and Parliament where the winter session was to start days later’’ అంటూ వర్ణించింది.
మహేంద్ర సింగ్ తికాయత్ 1988 శీతాకాలంలో చేసిన ఆందోళనలకు చాలా రాజకీయ, చారిత్రక ప్రాముఖ్యం ఉంది. 1989లో జరగాల్సిన ఎన్నికల్లో జనతాదళ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ బలం పుంజుకుంటోంది. వీపీ సింగ్ ప్రభావశీల నేతగా ఉన్నారు. మరోవైపు బీజేపీ బలం పెరుగుతోంది. అప్పటికే బోఫోర్స్ కుంభకోణం వీపీ సింగ్ సహా కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. అధికార కాంగ్రెస్ ఓడిపోయే స్థితిలో ఉంది.
తికాయత్ కుటుంబీకుల వ్యూహాత్మక దృష్టికి ఇలాంటి స్థితులే అద్దం పడతాయి. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నపుడు, లేదా దేశంలో కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నపుడు ఢిల్లీ అడ్డాగా ఆందోళన్ స్టంట్ సృష్టించడం అన్నమాట. బోఫోర్స్ కారణంగా అప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కాంగ్రెస్ తికాయత్ పెట్టిన తిరకాసుకు తలవంచక తప్పలేదు. అయినా సరే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. 1990లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెరకు రైతుల సమస్యలు పరిష్కారించాలంటూ 2లక్షల మంది రైతులతో పాట్నాను దిగ్బంధం చేశాడు. ఏ ఆందోళన అయినా లక్షల్లో జనాన్ని పోగేసి ఆ తర్వాత కోట్లలో డబ్బు దండుకోవడమే వీరిపని.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంలో చిట్టచివరి పేరా గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. The following year, before the Lok Sabha elections, N D Tiwari signed a pact with the BKU, conceding many of its demands’’. ఇదీ నాటి హుక్కా తికాయత్ రైతు ఆందోళన రహస్యం. 32 శీతాకాలాల తర్వాత 33వ శీతాకాల సమావేశాల వేళ గతేడాది జూనియర్ తికాయత్ ప్రవేశించాడు.
జూనియన్ తికాయత్ కథేంటో చూద్దాం.
గతేడాది ఆగస్ట్ లో ఢిల్లీ రైతుల ఆందోళనల నాటికి దేశంలో అనేక రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 11న డీఎఏ పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. దాని శీర్షిక ఇలా ఉంది…‘‘ BKU leader Rakesh Tikait’s massive financial worth’’ ఈ కథనంలో రాకేశ్ తికాయత్ కు నాలుగు రాష్ట్రాల్లో ఆస్తుల్లున్నట్టూ పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఈ ఆస్తులున్నట్టూ వెల్లడించింది.
ఈ నాలుగు రాష్ట్రాల్లోని 13 నగరాలు- ముజఫర్ నగర్, లలిత్ పూర్, ఝాన్సీ, లఖీంపూర్ ఖేరీ, బిజ్నూర్, బదౌన్, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, డెహ్రాడూన్, రూర్కీ, హరిద్వార్, ముంబై నగరాల్లో సుమారు 80 కోట్ల ఆస్తులున్నట్టు వెల్లడించింది. వీటితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెట్రోల్ బంకులు, షో రూమ్ లు, ఆధునిక ఇటుక తయారీ పరిశ్రమ లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు సదరు సోకాల్డ్ రైతాంగ ఉద్యమకారుడు రాకేశ్ తికాయత్.
Larry Page, Jeff Bezos లతో సమానంగా వెయ్యి కోట్ల ఆస్తులున్న రాబర్ట్ వాద్రా కూడా సందులో సడేమియాగా ఆందోళనల్లో ‘నేతగా’ అవతారమెత్తాడు. All India Kisan Sangharsh Coordination Committee కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న వి.ఎం సింగ్ స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల విలువ 632 కోట్లు. బీజేపీ నేత వరుణ్ గాంధీపై ఫిల్బిత్ నుంచి వి.ఎం.సింగ్ పోటీ చేశారు.
ఇలా ఆస్తుల గురించి మాట్లాడితే వామపక్ష మేధావులు కొత్త వాదన లంకించుకుంటారు. తమ నిమిత్తం లేకుండా వారసత్వంగా ఆస్తి ఉన్నవాళ్లు, హక్కుల గురించీ, న్యాయమైన డిమాండ్ల గురించి మాట్లాడకూడదా అని. ఖచ్చితంగా మాట్లాడవచ్చు. కానీ, నిరుపేదలను ఎరగా వేసి, మందబలాన్ని చూపి సంపన్న రాజకీయ పార్టీల నుంచి అక్రమ సొమ్ము సంపాదించిన వారికి రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడే నైతికత ఖచ్చితంగా లేదనే చెప్పాలి. పైగా పేదలు తమ ఆదాయ మార్గాలను వదిలేసి ఆందోళనల్లో పాల్గొంటుంటే నేతలు మాత్రం విలాసజీవితం గడపటం ఏ నైతికతకు నిదర్శనం?
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ ముజఫర్ నగర్ లో నిర్వహించిన ‘మహాపంచాయత్’ అసలు ఉద్దేశం జాట్ల ఓట్ల కోసం. ఓట్లు, సీట్ల వేటలో ఆందోళనలు అత్యంత శక్తివంతమైన వలలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల వరకూ ఎలాగైనా రైతుల ఆందోళన కొనసాగాలని జూనియర్ తికాయత్ తో ఒప్పందం చేసుకుని ఉంటుంది కాంగ్రెస్.
1988లో ఎన్డీ తివారీ సీనియర్ తికాయత్ తో ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు జూనియర్ తికాయత్ తో ఎవరు చేసుకుని ఉంటారో సులభంగానే ఊహించవచ్చు. సోకాల్డ్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ‘మహాపంచాయితీ’ల వెనుక ఉన్న మరుగుజ్జు పెద్ద మనిషి. ఈ పంచాయితీలన్నీ 2024 ఎన్నికల్లో అధికారం కోసమే!
ఇక చివరగా 1907లో Punjab Land Colonisation, Punjab Land Alienation Act చట్టాలకు వ్యతిరేకంగా షహీద్ భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్, మేనమామ సర్దార్ అజిత్ జింగ్ ల నేతృత్వంలో ఏర్పడిన ‘భారత్ మాతా సొసైటీ’ బ్రిటీష్ వలస వ్యతిరేక పోరాట జరిగింది. లాలా లజపత్ రాయ్ లాంటి స్వాతంత్ర్య సమర యోధులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నాటి ఉద్యమానికి గతేడాది కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు సంబంధం ఏంటో అర్థం కాదు. స్ఫూర్తికి అయినా ఏదో ఒక పరమార్థం ఉండి తీరాలి. అదీ వదిలేద్దాం. 1907 జరిగిన పోరాటానికి 2007తో వందేళ్లు నిండుతాయి. 2020కి అది వందేళ్ల పోరాటం ఎలా అయిందో అర్థం కాదు.