హనీట్రాప్.. భారత్ కు చెందిన ఎంతో మంది అధికారులతో అమ్మాయిలను ఉపయోగించి బుట్టలో వేయాలని ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) టీమ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. హనీ ట్రాప్ చేయడం.. భారత్ కు చెందిన రహస్యాలను సొంతం చేసుకోవాలని ఐఎస్ఐ పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఆర్మీ, నేవీ.. ఇలా రక్షణ రంగానికి చెందిన వ్యక్తులను ట్రాప్ చేయడం ఐఎస్ఐ పని..! అలా ఓ వ్యక్తిని హనీట్రాప్ చేసే పనిలో ఐఎస్ఐ పడింది. భారత ఆర్మీకి చెందిన వాడినని చెబుతున్న సదరు వ్యక్తిని మచ్చిక చేసుకోడానికి బాగానే ప్రయత్నాలను కూడా చేసింది. తీరా చూస్తే అతడొక ‘ఫేక్’ ఆర్మీ అధికారి.
ఆర్మీ ఆఫీసర్ లాగా నటిస్తున్నందుకు ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ 40 ఏళ్ల వ్యక్తిని విచారించిన ఢిల్లీ పోలీసులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. అతడు నిజమైన ఆర్మీ ఆఫీసర్ అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయిన పాకిస్తాన్ ఐఎస్ఐ అతడిని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చిందట..! నిజమైన ఆర్మీ ఆఫీసర్ అని భావించి అతడిపై వలపు వల వేయడానికి ఐఎస్ఐ చాలా ప్రయత్నించింది.

నిందితుడిని న్యూ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ నివాసి దిలీప్ కుమార్ గా గుర్తించారు. ఓ వ్యక్తి తనకు తానుగా ఆర్మీకి చెందిన వ్యక్తి అని చెప్పుకొంటూ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని పట్టుకోడానికి పగడ్బంధీగా ప్లాన్ వేశారు. అర్చన రెడ్ లైట్ ప్రాంతం వద్ద పోలీసులను మోహరించారు. అతడు ఆర్మీ డ్రెస్ లో ఉంటూ పలువురిని మభ్యపెట్టాడు. అతడు ఆ దుస్తుల్లో ఉండగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ కుమార్ పేరిట ఒక నకిలీ ఆర్మీ ఐడి కార్డు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను అనేక గ్రూపులలో సభ్యుడట. నిజమైన భారత ఆర్మీ సభ్యుడని భావించిఇతర దేశాల నుండి అనేక అంతర్జాతీయ వాట్సాప్ నంబర్లతో అతడిని సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా.. నిందితుడు అంతర్జాతీయ నంబర్లతో వీడియో కాల్స్ చేశాడని తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. విచారణలో అతడు తన పేరును కెప్టెన్ శేఖర్ గా పలువురికి పరిచయం చేసుకున్నాడని తెలుస్తోంది. పలువురు మహిళలు అతడితో వీడియో కాల్స్ మాట్లాడారు. అతడు నిజమైన ఆర్మీ ఆఫీసర్ అనుకుని ఐఎస్ఐ కూడా అతడిపై వలపు వల విసరడానికి ప్రయత్నించింది. పలువురు అందమైన అమ్మాయిలు అంతర్జాతీయ నెంబర్లతో తనతో మాట్లాడేవారని అతడు చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా తనను నిజమైన భారత ఆర్మీ అధికారి అని భావించిందని తెలిపాడు. అతడిపైన ఓ కేసును రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్ 170/419/420/468/471 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది.