More

  పెట్రోల్ కొనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

  చైనాతో భౌగోళిక ఉద్రిక్తత తాత్కాలికంగా సమసిపోయింది. అమెరికా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ‘అసియా పసిఫిక్’ చక్రబంధాన్ని పెంటగాన్ మరింత కట్టుదిట్టం చేసింది. చైనా ఎత్తుగడల రీత్యా వెనక్కి తగ్గింది. గర్జించ లేదు, అట్లాగని అర్థించ లేని దుస్థితిని పాకిస్థాన్ ఎదుర్కొంటోంది. భారత్ తో బంధాన్ని రష్యా ప్రస్తుతం నిరాకరించే స్థితిలో లేదు. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు గుగ్గిలం కప్పుకుని అదను కోసం ఎదురు చూస్తున్నాయి.

  మోదీ ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టికి త్వరితగతిన విధాన నిర్ణయాలు చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది. సాగు సంస్కరణలను వ్యతిరేకించే పేరుతో హింసాగ్ని దేశ రాజధానిని కలచివేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ‘భారత్ బంద్’ కూడా ‘మమ’ అనిపించుకుంది.

  చరిత్రలో ధరవరలు పెరగడం ఇది తొలిసారి జరిగిందా? 90వ దశకంలో సంస్కరణలు ప్రవేశపెట్టి…విశ్వవిఫణికి ఆహ్వానం పలికి, అందుకు తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది ఎవరు?

  2019 ఎన్నికల తర్వాత దేశంలో ప్రతిపక్షాలు చేస్తున్నదేమిటి?

  లాభాలు గడిస్తున్న ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు ప్రభుత్వానికి విధిగా పన్నులు చెల్లిస్తున్నాయా? అనుకూలంగా మదింపు వేయించి ఎగ్గొట్టేస్తున్నారా? లాభాలపై ఆదాయపు పన్ను కట్టనివారు పెట్రోల్ ధర పెరిగితే గింజుకోవడం దేనికి? పన్నుల పేరుతో చేస్తున్న ఆందోళనల వెనుక జరుగుతున్నదేంటి? ఐచ్చికంగా పన్నులు చెల్లిస్తున్నావారి సంఖ్య ఎంత?

  ఇలాంటి అంశాలు సూటిగా, సుత్తిలేకుండానే కాదు; కాస్త ఘాటుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను….సాధికారిక గణాంకాలను, పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ఆధారంగా వివరిస్తాను.

  గతేడాది ఫిబ్రవరిలో ‘చార్టర్డ్ అకౌంటెంట్స్ డే’ సందర్భంగా ‘సీఏ’లకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ..సుతారంగా చురకలు కూడా వేశారు. దేశంలో కోటీ యాభై లక్షలమంది మాత్రమే విధిగా ఆధాయ పన్నులు చెల్లిస్తున్నారనీ, దేశ జనాభా మాత్రం 130 కోట్లని గిల్లినట్టే గుర్తుచేశారు. అంటే దేశంలో కేవలం 1.15 శాతం ప్రజలు మాత్రమే పన్నుభారం మోస్తున్నారని వాపోయారు.

  ఇందులో కోటికిపైగా ఆదాయం ఉన్న 2,200 మంది సీఏలు, వైద్యులు ఇతర వృత్తి నిపుణులు…మాత్రమే ఐచ్ఛికంగా పన్ను చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. ఆదాయ పన్ను చెల్లించగలిగేవారు..నిజాయితీగా చెల్లిస్తే…దేశంలో పేదరికం పోతుందని, ప్రగతిపథంలో నడస్తుందంటూ తీవ్ర స్వరంతోనే చిరు హెచ్చరిక చేశారు.

  ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యానికి గురికావడం ఖాయం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 57.8 మిలియన్ల మంది ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే…43.2 మిలియన్ల మంది 5లక్షల లోపు ఆదాయం ఉన్నట్టూ లెక్కచూపారు. అంటే పన్ను కట్టనక్కరలేకుండా జాగ్రత్త పడ్డారన్నమాట.
  పన్నుఆధారిత వ్యవస్థలు బలపడనంత వరకూ…ఆర్థిక చిక్కులు తప్పవని గుర్తించి వాజ్ పాయి ప్రభుత్వం పన్నుల వ్యవస్థను సంస్కరించేందుకు ‘కేల్కర్ టాస్క్ ఫోర్స్’ ను ఏర్పాటు చేసింది. 2002లోనే విజయ్ కేల్కర్ జీఎస్టీ పన్నును ప్రతిపాదించారు. ఆ తర్వాత మారిన ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది.

  ప్రజలు స్వచ్చందంగా ఎన్నుకున్న ‘‘పన్ను ఆధారిత వ్యవస్థ’’నే ప్రభుత్వమని స్థూలంగా నిర్వచించారు. అలాంటప్పుడు ఆదాయంపై పన్ను చెల్లించకుండా, సేవలపై పన్నులు పెంచినప్పుడు గోలచేయడం వల్ల ప్రభుత్వాల నిర్ణయాలు మారవు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి కీలక సేవలపై పన్ను వడ్డనలు భారీగానే ఉండటం సహజం.

  కోటీకి పైగా ఆదాయం ఉన్న సీఏలు, వైద్యులు ఇతర వృత్తి నిపుణులు కేవలం 2,200మంది పన్ను చెల్లిస్తున్నారు. దేశంలో ఉన్న వైద్యుల సంఖ్య ఎంతో తెలుసా?
  గతేడాది ఏప్రిల్ 2న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కేవలం 5 రాష్ట్రాల్లో-మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, ఉత్తర ప్రదేశ్ లలో సుమారు 12లక్షల ఒక వెయ్యి 354మంది అలోపతి వైద్యులు ఉన్నారు. మరో 7.88 లక్షల మంది ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు ఉన్నారు. అంటే దేశంలో సుమారు 20 లక్షల మంది వైద్యులు కనీసం వెయ్యి మంది కూడా పన్ను చెల్లించడం లేదన్నమాట.

  The Institute of Chartered Accountants of India-ICAI లెక్కల ప్రకారం 2లక్షల 91వేల 698మంది రిజిస్టర్డ్ సీఏలు దేశంలో ఉన్నారు. దీంట్లో లక్షా 92వేల 857 మంది అసోసియేట్లు వీరివద్ద సహాయకులు సంఖ్య 98వేల 841అని 2019లో ICAI వెల్లడించింది. అంటే సుమారు 5లక్షలమంది పన్నుమదింపు వేసే వృత్తిలో ఉన్నవారే స్వయంగా పన్ను కట్టడంలేదని ఆదాయ పన్నుశాఖ తేల్చింది. ఉన్నత విద్యావంతులు, పారిశ్రామిక వేత్తలు పన్నులు ఎగవేస్తుంటే నిరుపేదలు మాత్రం తమ నిత్యావసరాల మీద ప్రభుత్వాలకు చచ్చీచెడి పన్నులు కడుతున్నారన్నమాట.
  2015-18 మధ్య కాలంలో ఆదాయపన్ను శాఖ 50 లక్షల లోపు పన్ను ఎగవేత దారులే లక్ష్యంగా దాడులు చేసింది. అంతకన్నా ఎక్కువ ఎగ్గొట్టినవారిని వదిలేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం అధిక పన్ను ఎగవేత దారులను వదలకూడదని ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. జనవరి మాసం మొదటి వారంలోనే 7వేల సంస్థలు జీఎస్టీని ఎగవేసినట్టు గుర్తించి 184 మందిని అరెస్టు చేసింది.

  సంస్కరణల నేపథ్యం ఏంటో చూద్దాం..

  పీ.వీ.నరసింహారావు తీసుకున్న చర్యల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ, దేశ ప్రజల జీవనప్రమాణాలు మారిపోయాయి. 1987నాటికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టాలంటే చిక్కులు ఉండేవి. ప్రతి చిన్న పనికీ అనుమతులు, రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ నడుస్తుండేది. చిన్న విషయాలకు కూడా డిఐసి అనుమతులు అవసరమయ్యేవి.

  పారిశ్రామికరంగం ఒక దశ, దిశ లేకుండా ఎటు పోతుందో అర్ధం కాకుండా, అయోమయం నెలకొని ఉండేది. 1991 కి ముందు విదేశాలకు వెళ్లాలంటే, ఏడాదిలో ఒక దేశానికి ఒకసారికి మించి వెళ్లకూడదనే నిబంధన ఉండేది. ఇది కూడా పారిశ్రామికాభివృద్ధికి గుదిబండగా మారింది. ఎగుమతులు, దిగుమతులపై అనేక ఆంక్షలుండేవి. ఇలాంటి ఆటంకాలన్నింటినీ పీవీ ప్రభుత్వం తొలగించింది. దేశంలో టెలికమ్యూనికేషన్ల విప్లవాన్ని తీసుకొచ్చింది.

  1989–91 మధ్య సంకీర్ణ ప్రభుత్వాలది విఫల చరిత్ర. 1996లో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే తిరిగి రెండేళ్లలో ఇద్దరు ప్రధానమంత్రులు మారారు. మళ్లీ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఈ రెండు అనుభవాల వల్ల ప్రాంతీయపార్టీల కలగూర గంప కూటములతో దేశాభివృద్ధి కుంటుపడుతోందని తేలిపోయింది.

  1998 ఎన్నికలలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రి పదవి చేపట్టాక పీవీ విధానాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల దేశం అభివృద్ధిపథంలో పయనించింది. 2004 ఎన్నికల్లో యుపిఎ విజయం సాధించాక నరసింహారావు సన్నిహితుడిగా రాజకీయాల్లోకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినా 91-96 మధ్య కాలంలో జరిగినంత అభివృద్ధి జరగలేదు.
  ఇక్కడే ఓ ఆసక్తికరమైన, నాటకీయతను మించిన వాస్తవ ఘటనను చెప్పాలి. ‘‘When Crime Pays: Money and Muscle in Indian Politics’’ పేరుతో 2017లో మిలన్ వైష్ణవ్ రాసిన పుస్తకం ఆరంభంలోనే ఓ దారుణ వాస్తవాన్ని బట్టబయలు చేశారు. 2008 జూలై నాటికి యూపీఏ ప్రభుత్వం కూలిపోతుందన్న భయం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను పట్టి పీడిస్తోంది.

  వివాదాస్పద భారత్-అమెరికా అణు ఒప్పంద బిల్లు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అణు బిల్లు ఎక్కడ అవిశ్వాస తీర్మానానికి గురవుతుందో…అనే భయాల నేపథ్యంలో తీహార్ జైల్లో తీవ్ర ఆరోపణలతో రిమాండ్ లో ఉన్న ఆరుగురు ఎంపీలను….యూపీఏ కూటమికి చెందిన ఎంపీల బృందం రహస్యంగా భేటీ అయింది. అణు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. ఓటింగ్ కు సరిగ్గా 48 గంటల ముందు ఈ రహస్య భేటీ జరిగిందని మిలన్ వైష్ణవ్ పేర్కొన్నారు. సరే ఆ తర్వాత గడువుకు ముందే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి.

  ఆరుగురు ఎంపీలు-ఉత్తర ప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు అతీఖ్ అహ్మద్, ఎల్జేపీ ఎంపీ పప్పు యాదవ్, ఆర్జేడీ నేత మహమ్మద్ షాబుద్దీన్, సూరజ్ భాన్ సింగ్, అప్జల్ అన్సారీ, ఉమాకాంత్ యాదవ్ లు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరిగిన రోజు వీరంతా పార్లమెంట్ కు హాజరయ్యారు. వీరందరిపై క్రూరమైన హత్య, అత్యాచారం, దోపిడీ ఆరోపణలూ ఉన్నా….కాంగ్రెస్ ఒప్పందం కారణంగా విడుదలయ్యారు.

  ఈ ఉదాహరణకు ఉన్నప్రాధాన్యత ఏంటి? అనే సందేహం రావచ్చు…..రైతులపై, దేశ ప్రజలపై, సరిహద్దు భద్రతపై అపారమైన ప్రేమను కురిపిస్తున్న కాంగ్రెస్ తన అధికారం కాపాడుకోవడం కోసం దుర్మార్గులుగా ముద్రపడిన నేతలను విడిపించి పార్లమెంట్ కు రప్పించింది. ప్రజాస్వామ్యన్ని అవమానించింది.

  2004-2014 వరకూ దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి….మళ్లీ మళ్లీ చెబితే…పునరుక్తి దోషం వెంటాడుతుంది కాబట్టి వివేచన ఉన్నవారి ఊహకు వదిలేయడం శ్రేయస్కరం.

  2016లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ, నోట్ల రద్దు సంస్కరణలు ఉపయోగ పడతాయని ప్రతిపక్షాలు భావించాయి. 2019 ఎన్నికల్లో మునుపటి కన్నా పెచ్చు మెజారిటీతో బీజేపీ హయాంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖంగుతిన్నాయి. 2024 ఎన్నికల నాటికి మోదీని నిలువరించకపోతే ప్రాంతీయ పార్టీలు సహా, కాంగ్రెస్ పార్టీ మనగలగడం అసాధ్యమని భావించాయి. సీఏఏ, 370 అధికరణం రద్దు, వ్యవసాయ సంస్కరణలు, తలాక్ రద్దు, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత పేరుతో విఫల ఉద్యమాలకు పిలుపునిచ్చి అభాసు పాలయ్యాయి.

  తాజాగా ఐదు కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి పథక రచన చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరీ రాష్ట్రాల్లో కేరళలో మాత్రమే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రభావం చూపించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు సాధించేది కూడా ఏమీ లేదు.
  నిజానికి ఎన్నికల ఫలితాలను విధాన నిర్ణయాలు ప్రభావితం చేయవు-జాతి సాంస్కృతిక చిహ్నాలు-బలమైన నాయకత్వం ఉందనే భరోసా-ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత మాత్రమే నిర్ణయాక పాత్ర పోషిస్తాయి.
  మొత్తంగా ప్రైవేటీకరణపై అసత్య ప్రచారాలు…, పెట్రో ధరల పెరుగుదల రాజకీయంగా ఉపయోగపడతాయన్న విపక్షాల అంచనాలను… పాంచ్ పటాకా ఫలితాలే నిర్దేశిస్తాయి.

  Trending Stories

  Related Stories