ఫ్యాక్ట్ చెక్: కాళ్లకు సంకెళ్లతో ఉన్నది స్టాన్ స్వామి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..!

0
752

ఎల్గార్ పరిషద్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద గతేడాది అరెస్ట్ అయిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో మరణించారు. ముంబై బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్​లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్టాన్ స్వామి తుదిశ్వాస విడిచారని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ డిసౌజా తెలిపారు. మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా స్టాన్ స్వామిని 2020 అక్టోబర్​లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన ముంబై సమీపంలోని తలోజా జైల్లోనే ఉంటున్నారు. కోర్టు ఆదేశాలతో మే 28న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని స్టాన్ స్వామి గత వారం బాంబే హైకోర్టుకి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో స్టాన్ స్వామి మరణించారనే వార్త బయటకు వచ్చింది.

స్టాన్ స్వామికి పలువురు నివాళులు అర్పించారు. అయితే ఓ వృద్ధుడి కాళ్లకు సంకెళ్లు ఉన్న ఫోటోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. 84 సంవత్సరాల స్టాన్ స్వామిని ఇలా పోలీసులు సంకెళ్లు వేసి ఆసుపత్రి బెడ్ మీద ట్రీట్మెంట్ ఇచ్చారంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఇంకొందరైతే ఏకంగా ఆ ఫోటోను తమ ప్రొఫైల్ పిక్ లుగా మార్చేసుకున్నారు.

మానహక్కుల సంఘాలు ఎక్కడికి వెళ్లాయంటూ ఈ ఫోటోను పోస్టు చేసిన పలువురు ప్రశ్నించారు.

నిజమేమిటంటే:

ఈ ఫోటోలో ఉన్నది స్టాన్ స్వామి కానే కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ‘నిజం లేదు’.

ఫోటోలో ఉన్న వ్యక్తి స్టాన్ స్వామి కాదు, హంతకుడు ‘బాబూరామ్ బల్వాన్ సింగ్’. మే 21, 2021 న టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఫోటోను ప్రచురించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరును విమర్శిస్తూ పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వృద్ధుడి వయస్సుని దృష్టిలో పెట్టుకుని అతడి కాళ్లకు సంకెళ్లు వేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. దీని పర్యవసానంగా, బాధ్యులపై విచారణకు ఆదేశించారు. ఈ పని చేసిన జైలర్ ను సస్పెండ్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

జైలర్ కుల్దీప్ సింగ్ భదౌరియా మాట్లాడుతూ “శ్వాసకోశ సమస్యల కారణంగా హత్య కేసులో దోషి అయిన బాబూరామ్ బల్వాన్ సింగ్ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని అలీఘర్ కు పంపించారు. కానీ అక్కడ మంచం అందుబాటులో లేదు, కాబట్టి అతన్ని తిరిగి ఎటాకు తీసుకువచ్చారు, అక్కడ అతన్ని జిల్లా ఆసుపత్రి లోని నాన్ కోవిడ్ -19 వార్డులో చేర్చారు. అతన్ని ఏ పరిస్థితులలో మంచానికి కట్టారో స్పష్టంగా లేదు. మొత్తం విషయం దర్యాప్తు చేస్తున్నారు. ” అని అప్పట్లో మీడియాకు వివరణ ఇచ్చారు.

ఎటా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఓ) డాక్టర్ ఉమేష్ త్రిపాఠి మాట్లాడుతూ “ప్రాధమిక దర్యాప్తు తరువాత, జైలు సిబ్బంది రోగిని మంచానికి కట్టేసినట్లు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా మొత్తం విషయం గురించి తెలుసుకున్నాను. జైలు ఖైదీ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. అతనికి తగిన చికిత్స అందిస్తున్నారు. ” అని వెల్లడించారు.

ఈ ఏడాది ప్రారంభంలో బాబూరామ్ బల్వాన్ సింగ్ హత్యకు పాల్పడ్డాడు. అతను కుల్లా హబీబ్పూర్ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. ఫోటోలో ఉన్న వ్యక్తి స్టాన్ స్వామి కాదని నిరూపించేలా పలు మీడియా సంస్థలు ఇంతకు ముందు కథనాలను పోస్టు చేశాయి. ఆ సమయానికి స్టాన్ స్వామి జీవించే ఉన్నారు. ఇక రెండు ఫోటోలను పరిశీలిస్తే వ్యత్యాసాన్ని బాగా గమనించవచ్చు.

అలా వృద్ధుడి కాళ్లకు సంకెళ్లు వేసిన జైలు అధికారిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

కాబట్టి స్టాన్ స్వామి ఆ ఫోటోలో ఉన్నది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × two =