More

    ఏడు గంటల పాటూ మొరాయించిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

    ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు గంటల పాటూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు మొరాయించాయి. సోమవారం రాత్రి 9 గంటల నుండి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు పని చేయడం మానేశాయి. ఇంతకూ ఏమి జరుగుతుందో తెలియక నెటిజన్లు చాలా టెన్షన్ పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ లో పేజీ లోడ్ కాకపోవడం.. ఎంతో మంది ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం, రీస్టార్ట్ చేయడం వంటివి చాలా చేశారు. వాట్సాప్ లో మెసేజీలు కూడా అసలు వెళ్ళకపోవడంతో ఏమైందోనని భయపడ్డారు. ఫేస్ బుక్ లో పేజీలు అసలు ఓపెన్ అవ్వలేదు. ఏదైనా అప్లోడ్ చేద్దామన్నా కుదరలేదు. అలా దాదాపు ఏడు గంటలపాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. తమ వెబ్‌సైట్‌, యాప్‌లు, ఇతర ప్రోడక్ట్స్‌ ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు వినియోగదారులకు తెలిపేందుకు ఫేస్‌బుక్‌ ప్రత్యేకమైన ‘స్టేటస్‌’ పేజీని నిర్వహిస్తుంటుంది. వెబ్‌సైటే డౌన్‌ అయిన నేపథ్యంలో ‘ఫేస్‌బుక్‌ స్టేటస్‌’ పేజీ నుంచి వినియోగదారులకు సందేశాలు పంపే వీలు కూడా లేకుండాపోయింది. దీంతో ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేయాల్సి వచ్చింది.

    సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఫేస్‌బుక్ సంస్థవేనని తెలిసిందే..! సేవల పునరుద్ధరణకు చాలానే కష్టపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. సేవలు నిలిచిపోవడంపై ఫేస్‌బుక్ క్షమాపణలు తెలిపింది. తమకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది.

    ఫేస్‌బుక్‌కు భారత్‌లో 41 కోట్ల మంది, వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మందికిపైగా వినియోగదారులున్నారు. “To every small and large business, family, and individual who depends on us, I’m sorry,” అంటూ ఫేస్ బుక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ స్క్రోఫర్ తెలిపారు.

    వినియోగదారుల నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాట్సాప్ కు సంబంధించిన 9000 క్రాష్‌ రిపోర్టులు, ఇన్‌స్టాగ్రామ్‌పై 8000 క్రాష్‌ రిపోర్టులు, ఫేస్‌బుక్‌పై 4000 క్రాష్‌ రిపోర్టులు వచ్చాయని నిపుణులు వెల్లడించారు. వెబ్‌సైట్‌, యాప్‌, సర్వర్‌ కనెక్షన్‌లకు సంబంధించిన సమస్యల వల్లే ఈ మూడు యాప్‌లు మొరాయించి ఉండొచ్చని తెలిపారు.

    Related Stories