భారత్ లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టా మే 26 నుండి బంద్ అవుతున్నట్లేనా..!

0
885

సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లపై నేటి యువత ఎక్కువగా ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే..! అయితే భారత్ లో ఈ సోషల్ మీడియా దిగ్గజాలు మే 26 నుండి బంద్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సోషల్‌ మీడియా కట్టడికి ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త నియమావళి బుధవారం మే 26 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధనలను పాటించటానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు కొద్దిసేపటిలో ముగియనుంది. ఒకవేళ ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమనిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో.. ఇప్పటికే చాలా కంపెనీలు భారత్ లో ఆఫీసులనైతే ఓపెన్ చేశాయి కానీ.. మిగిలిన నిబంధనలను పాటించడంలో మాత్రం చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తున్నాయి. భారత్ లో సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకరమైన కంటెంట్ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి నిబంధనలను తీసుకొని వచ్చింది.

మూడు నెలల నుండి ఏ సంస్థ కూడా ఆ నిబందనలు అంగీకరించ లేదు. దీంతో మే 26 నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధలపై ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు మే 26తో ముగుస్తుండడంతో ఇక ఇండియాలో ఆయా సోషల్ మీడియా సంస్థలు బ్లాక్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. గతంలో ఈ కంపెనీలు ఆరు నెలల సమయం కావాలని కోరినప్పటికీ కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. భారత్ లో ఇలా సామాజిక మాధ్యమాలు నిలిచిపోతే ఆయా సంస్థలు భారీ నష్టాలను చవి చూసే అవకాశం ఉంది.

ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా సహకారం అందించాలని.. లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుంది. జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు అధికారిని.. ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని తప్పనిసరిగా నియమించాలని తేల్చి చెప్పింది. కంపెనీలో ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కొత్త నిబంధనల్లో కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి 26న కొత్త నిబంధనల గురించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఓటీటీ, డిజిటల్ న్యూస్‌ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చెప్పాలని కోరారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోయినప్పటికీ.. కేవలం వాటి నుంచి సమాచారం మాత్రమే కోరుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలకు ఇంకా సమయం కావాలని సదరు టాప్ సోషల్ మీడియా సంస్థలు కోరుతూ ఉండడంతో ఆయా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

20 − one =