National

కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. విపక్ష సభ్యులు సభలో చేస్తున్న రచ్చకు.. వాయిదా వేయక తప్పడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ తీరును తాజాగా తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ కావాలనే అడ్డుకుంటోందని మోదీ మండిపడ్డారు.బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను ఎదుర్కొనే విధానంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. సభలో చర్చలు జరగకుండా, సభ నడవకుండా ఆటంకాలు సృష్టిస్తోందని.. ఆ పార్టీకి అసలు సభ నిర్వహణ ఇష్టమే లేనట్టుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికీ కాంగ్రెస్ నేతలు హాజరు కాలేదంటేనే వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని మోదీ అన్నారు. ఆ పార్టీ నేతల తీరును జనం, మీడియాలో ఎండగట్టాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని సూచించారు. ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఎంపీలంతా తమతమ ప్రాంతాలకు వెళ్లి అసలు నిజాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్, ప్రధాని మాట్లాడే సమయంలోనూ కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్న సంగతి తెలిసిందే..! మిగతా విపక్షాలు కూడా పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వట్లేదు.నేడు కూడా రాజ్యసభ, లోక్ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి.

పెగాసస్ సైబర్ దాడి వ్యవహారంపై జీరో అవర్ లో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమక్షంలోనే పెగాసస్ పై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. నేడు మోదీ, హోంమంత్రి అమిత్ షా లోక్ సభలోకి రావడంతో వారి సమక్షంలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలకు అవకాశం ఇస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చినా నిరసనలు సద్దుమణగలేదు. రాజ్యసభలోనూ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పెగాసస్ పై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పెగాసస్ పై చర్చ కోరుతూ నినాదాలు చేస్తున్న విపక్ష ఎంపీల తీరుపై మాట్లాడుతూ వెంకయ్య.. పార్లమెంటు ఉన్నది చట్టాలు చేసేందుకేనని, విపక్షాలు అంతరాయం కలిగించడం సరికాదన్నారు. కానీ పార్లమెంటును అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. దీంతో ఆయన సభను వాయిదా వేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − five =

Back to top button