పాకిస్థాన్ లో భారీ పేలుడు

0
986

పాకిస్థాన్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. క్వెట్టా నగరంలోని ఫాతిమా జిన్నా రోడ్‌లో పోలీసు వ్యాన్ సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. డిఐజి ఫిదా హుస్సేన్ మాట్లాడుతూ 2-2.5 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు తెలుస్తోందని అన్నారు. మరణించిన వారిలో ఒకరిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి)గా గుర్తించారు. పోలీసు అధికారులతో సహా 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో ఒక ప్రకటనలో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పిరికిపంద టెర్రరిస్టులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద దాడికి పాల్పడ్డారని విమర్శించారు. క్వెట్టా, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని బిజెంజో వ్యాఖ్యానించారు.

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ సంవత్సరం వేర్పాటువాదుల దాడులు, హింసాత్మక సంఘటనలు పెరిగాయి, భద్రతా దళాలపై చాలా దాడులు జరిగాయి. ఫిబ్రవరి 2 న, బలూచిస్థాన్ వేర్పాటు వాదులు రెండు వేర్వేరు సంఘటనలలో భద్రతా దళాల శిబిరాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనేక దాడులు, పేలుళ్లతో బలూచిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని డాన్ వార్తాపత్రిక తెలిపింది. గత నెలలో, ప్రావిన్స్‌లోని నౌష్కీ, పంజ్‌గూర్ జిల్లాల్లోని రెండు భద్రతా దళాల శిబిరాలపై సాయుధ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఒక అధికారితో సహా ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు.