అంబానీ ఇంటి ఎదురుగా అనుమానాస్పద కారు

0
666

భారత వ్యాపార దిగ్గజం, రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత.. ముకేష్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేపింది. ముంబాయిలోని ఆయన నివాసం యాంటిలియా ముందు.. గుర్తుతెలియని వక్తులు ఓ స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసి వెళ్లిపోయారు. మొదట ఈ వాహనాన్ని గుర్తించిన అంబానీ భద్రతా సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ కూడా కారును కూడా పరిశీలించింది. కారులో 20 జిలెటిన్ స్టిక్స్ తో పాటు.. ఓ బెదిరింపు లేఖ స్వాధీనం చేసుకున్న భద్రతా అధికారులు.. కారును మరోచోటికి తరలించారు.

అర్థరాత్రి ఒంటి గంట సమయంలో పచ్చరంగు స్కార్పియో కారును అక్కడ పార్క్ చేసినట్లు తెలుస్తోంది. సదరు కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అది ఎవరిది అయ్యింటుందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. కారు నెంబర్ ప్లేట్, ముఖేష్ అంబానీ భద్రతా కాన్వాయ్‌లో ఉండే కారు నెంబర్ ప్లేట్ ను పోలివుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారు పార్క్ చేసిన చోటుతో పాటు.. ఆ ప్రాంతం మొత్తాన్ని పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించినట్లు అధికారులు చెప్పారు.

అనుమానాస్పద కారు వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. కారులో జిలిటెన్ స్టిక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు. దీనిపై ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, కారులో లభించిన కొన్ని అనుమానాస్పద వస్తువులు, బెదిరింపు లేఖను ముంబై పోలీసులు ధృవీకరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ క్రికెట్ టీమ్ ముంబై ఇండియన్స్‌ లోగోను ముద్రించిన ఓ బ్యాగులో ఈ లెటర్ లభించింది. ఈ క్రికెట్ టీమ్‌కు ముఖేష్ అంబాని భార్య నితా అంబాని యజమానిగా వ్యవహరిస్తున్నారు. డ్రైవర్ సీటులో ఉంచిన ముంబై ఇండియన్స్ బ్యాగులో ఈ లెటర్ లభించిందని ముంబై పోలీసుల అధికార ప్రతినిది, డిప్యూటీ కమిషనర్ చైతన్య సిరిప్రోలు తెలిపారు.

ఈ లేఖలో ముఖేష్ అంబాని, నీతా అంబాని పేర్లను ప్రస్తావించారని పోలీసులు చెప్పారు. నీతా భాబీ, ముఖేష్ భయ్యా! ఇది ట్రైలర్ మాత్రమే. ఇదొక ఝలక్. ఈసారి పేలుడు వస్తువులు నేరుగా మీ వద్దకే వస్తాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. అని ఈ లేఖలో రాసి ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ లేఖ లభించిన తరువాత.. దీన్ని తాము తేలిగ్గా తీసుకోవట్లేదని చెప్పారు. దీని వెనుక కుట్ర కోణం ఉందనేది స్పష్టమైందని అన్నారు.

మరోవైపు, అనుమానాస్పద వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ పైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబానీ ఇంటికి 600 మీటర్ల దూరంలో పార్క్ చేసి ఉంచిన కారులో.. పేలుడు పదార్థాలు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్.. దాన్ని పార్క్ చేసిన వ్యక్తే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఈ సమాచారం ఇవ్వకపోయి ఉంటే.. ఆ కారు మీద పెద్దగా ఎవరి దృష్టి పడి ఉండేది కాదని, అందులో పేలుడు వస్తువులు ఉన్నవిషయం బహిర్గతం కావడంలో మరింత జాప్యం జరిగి ఉండేదనే అంచనాలు ఉన్నాయి.

అటు, పేలుడు పదార్థాలు ఉంచిన కారును యాంటిలియా సమీపంలో పార్క్ చేసి ఉంచడానికి నెల రోజుల కిందటే ఓ సారి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తోన్నారు. జిలెటిన్ స్టిక్స్‌ నింపి ఉన్న స్కార్పియోను మరో తెల్లరంగు కారు అనుసరించడం, కొంతసేపటి తరువాత ఆ కారు ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. స్కార్పియో వచ్చి ఆగిన చాలాసేపటి వరకు డ్రైవర్ అందులోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సీసీటీవీ ఫుటేజీలను ముంబై పోలీసుల నుంచి యాంటీ టెర్రరిస్ట స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఒకటైన ఈ ప్రాంతంలో,.. అది కూడా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు దొరకడం సంచలనంగా మారింది. అసలు పేలుడు పదార్థులున్న కారును అక్కడ ఎవరు పార్క్ చేశారు..? ఇందులో టెర్రరిస్టుల హస్తం ఏమైనా వుందా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here