రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో రైల్వే బ్రిడ్జిపై పేలుడు ఘటన.. దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. బ్రిడ్జిపై బాంబు పెట్టి పేల్చడంతో రైల్వే లైన్‌పై పగుళ్ళు ఏర్పడ్డాయి. ఘటనాస్థలాన్ని పరిశీలిస్తే.. దుండగులు బాంబు పేల్చి వంతెనను కూల్చే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పేలుడులో బ్రిడ్జికి ఏ విధమైన నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుడు జరిగిన నాలుగు గంటల ముందే అసర్వ-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ బ్రిడ్జి గుండా ప్రయాణించింది. సరిగ్గా రెండువారాల క్రితమే ప్రధాని మోదీ అసర్వ-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఉగ్రవాదులు ఈ రైలును టార్గెట్ చేసుకొని పేలుడు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు కాస్త ముందుగా జరిగి ఉండి ఉంటే రైలు పట్టాలు తప్పి పెద్ద ప్రమాదమే జరిగేది. ఘటనా స్థలంలో పెద్ద శబ్దంతో పేలుడు జరగటంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రైల్వే ట్రాక్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన జరిగిన స్థలంలో గన్ పౌడర్ కూడా కనిపించడంతో ఇది ఉగ్రవాదుల పనే అని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. బ్రిడ్జి కూల్చివేస్తే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా స్పందించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగటం హేయకరమన్నారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీ ఉమేష్ మిశ్రాను ఆదేశించారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ,.. తాము ఇప్పటికే చర్యలు మొదలుపెట్టామని తెలిపారు. రైల్వే పోలీసులతో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తులో తమకు కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా సహకరిస్తున్నాయని డీజీపీ అన్నారు. ఇప్పటికే కేంద్ర సంస్థలైన ‘ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ’ తో పాటు ‘యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్’ లు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఇక ఈ ఘటనపై మరో పోలీస్ అధికారి కూడా స్పందిస్తూ పేలుడులో దుండగులు ‘సూపర్ పవర్ 90’ అనే డిటోనేటర్ ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ పేలుడును దుండగులు ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని తెలిపారు. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.
అయితే ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదమంటే ప్రత్యక్షంగా ప్రజలనే టార్గెట్ చేసుకుని జరిగేవి. ఎక్కువగా జనసంచారం ఉండే మెట్రోపాలిటన్ నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. ఇందుకు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు నేరుగా సరిహద్దులు దాటి ఈ దాడులు చేసేవారు. కానీ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఘటనలన్నిటినీ దాదాపు కట్టడి చేయడం జరిగింది. సరిహద్దుల వద్ద ఎప్పటికప్పుడు నిఘా పర్యవేక్షణ ఉండటంతో,.. పాక్ నుంచి వచ్చి చేసే దాడులు దాదాపు తగ్గిపోయాయి. దీంతో ఉగ్రవాదం కొత్త దారులను అన్వేషిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ఉదయ్ పూర్ లోనే టైలర్ కన్హయ లాల్ హత్య ఘటన జరిగింది. ఈ హత్య చేసిన ఇద్దరూ కూడా పాకిస్తాన్ కు చెందిన దవాత్-ఇ-ఇస్లామీ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలింది. వీరు 2014లో పాకిస్తాన్ కు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తాజా ఘటనలో కూడా పాకిస్తానీయులు కాకుండా పాక్ ఉగ్రసంస్థలతో పరోక్ష సంబంధాలున్న వ్యక్తులే ఇటువంటి ఘటనలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు నేరుగా బాంబు పేలుళ్ళకు పాల్పడకుండా వ్యూహాత్మకంగా ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చేలా ఇటువంటి దాడులకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అస్సాంలో వరదలు రావడానికి కొందరు యువకులు బ్రిడ్జిని కూల్చివేశారని దర్యాప్తులో తేలింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.