తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకుని వచ్చే చట్టాల గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. షరియా చట్టాలను తీసుకుని రాబోతున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. తాలిబాన్లు కూడా ఇప్పటికే అందుకు సంబంధించిన హింట్స్ కూడా ఇచ్చేశారు. చిన్న చిన్న దొంగతనాలకు కూడా చేతులు నరికివేయడం,పెద్ద పెద్ద తప్పులకు శిరచ్చేదనం వంటివి త్వరలోనే అమలు చేయనున్నారు. దీంతో అక్కడి ప్రజలు కూడా భయపడుతూ బ్రతుకుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో మరణశిక్షలు, అవయవాలను తీసివేయడం వంటి తీవ్రమైన శిక్షలు మళ్లీ ప్రారంభమవుతాయని మాజీ తాలిబాన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో జైళ్ల బాధ్యతలు చూసుకుంటూ ఉన్న తురాబి “మా చట్టాలు ఎలా ఉండాలో మాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యలు చేశారు. 1990లో మాదిరిగానే ప్రస్తుత పరిపాలనలో కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తురాబి స్పష్టం చేశారు. తమ చట్టాలు, పరిపాలను ఎలా ఉండాలనేది ఇతర దేశాలు తమకు చెప్పకూడదన్నారు. షరియా చట్టాలను అనుసరించాల్సిన అవసరం ఉందని మరణశిక్షలు, శిరచ్ఛేదనాలు త్వరలో తిరిగి వస్తాయని తెలిపారు తురాబి. భద్రత కోసం చేతులు తీసివేయడం చాలా అవసరమని తురాబి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే బహిరంగంగా శిక్షలు విధించాలా వద్దా అనే విషయాన్ని మాత్రం కేబినెట్ అధ్యయనం చేస్తోందని స్పష్టం చేశారు.
తమ పాలనలో షరియా చట్టాల అమలే తప్ప ప్రజాస్వామ్యం ఉండబోదని తాలిబాన్లు ఇలా మనసులో మాటను చెబుతూ వస్తున్నారు. గతంలో తాము విధించిన కఠిన శిక్షల్ని తిరిగి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడమే కాకుండా త్వరలోనే ఈ శిక్షల అమలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 1990 లలో తాలిబాన్లు కాబూల్ స్పోర్ట్స్ స్టేడియం మరియు ఈద్ గాహ్ మసీదులో ఉరిశిక్ష అమలు చేసే వారు. తురాబి అప్పుడు తాలిబాన్ యొక్క మతపరమైన పోలీసింగ్ కు అధిపతిగా ఉండేవాడు.