National

దివంగత పీఆర్ కుమారమంగళం భార్య హత్య.. ఇంట్లో పనిచేసే వ్యక్తి ప్లాన్ చేసి

కేంద్ర మాజీ మంత్రి దివంగత పీఆర్ కుమారమంగళం భార్యను హత్య చేశారు. కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం (67) ఢిల్లీలోని ఆమె ఇంట్లో మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. ఆమెను హత్య చేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను పథకం ప్రకారం ఆమె ఇంట్లో పని చేసే దుస్తులు ఉతికే వ్యక్తి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. రాత్రి 9 గంటల ప్రాంతంలో దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది . కిట్టి హత్య కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితుడిని 24 ఏళ్ల రాజుగా గుర్తించారు. రాజు కిట్టి కుమారమంగళం ఇంట్లో దుస్తులు ఉతికే పని చేసేవాడని.. హత్య చేసిన రాత్రి మరో ఇద్దరితో ఇంట్లోకి ప్రవేశించి కిట్టీ కుమారమంగళంపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా హత్యచేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో రెండు సూట్ కేసులు తెరిచి ఉన్నాయి.

కిట్టీ కుమార మంగళం సుప్రీం కోర్టులో లాయర్ గా విధులు నిర్వర్తించారు. ఆమె భర్త దివంగత పీఆర్ కుమారమంగళం పీ.వీ. నరసింహారావు ప్రభుత్వం, వాజ్ పేయి ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. 1984లో మొదటిసారి సేలం లోక్ సభ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 1991-92 మధ్య కుమారమంగళం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, చట్టం, న్యాయ శాఖ మంత్రిగా, 1992-93 లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1998లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.

రాత్రి 9 గంటల సమయంలో ఇంటిలో పని చేసే వ్యక్తి తలుపులు తీసి మరో ఇద్దరు వ్యక్తులను లోపలికి తీసుకుని వెళ్ళాడు. ముగ్గురూ కలిసి ఆమెను మరొక గది లోకి తీసుకుని వెళ్లి కాళ్లు చేతులను కట్టేశారు. ఈలోగా మరో ఇద్దరు కలిసి కిట్టి కుమారమంగళంపై దిండు ఉపయోగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని అని నైరుతి ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ పోలీస్ (డిసిపి) ఇంగిత్ ప్రతాప్ సింగ్ వార్తా సంస్థ ఏఎన్ఐ కు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − six =

Back to top button