More

    టీఆర్ఎస్‎లో అవమానాలు ఎదుర్కొన్నా: బూర నర్సయ్య‎గౌడ్

    బలమైన సామాజికవర్గానికి చెందిన కీలక నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య‎గౌడ్ రాజీనామా అంశం ఇప్పుడు కారు పార్టీని కలవరపెడుతోంది. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 40వేల వరకు ఓటు బ్యాంకు ఉన్న సామాజికవర్గానికి చెందిన నరసయ్యగౌడ్ గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలుసార్లు పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా రాజీనామా చేస్తూ మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.

    తన రాజీనామా వెనుక అనేక కారణాలు ఉన్నాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు చెప్పుకోలేనంత అవమానాలు ఎదురయ్యాయని, కనీసం పార్టీ అధినేత కూడా తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మామూలు సమయంలో బూర నర్సయ్య రాజీనామా అనేది అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ మునుగోడు ఎన్నికల ప్రచారం పీక్స్‎కు చేరుకున్న దశలో నర్సయ్యగౌడ్ రాజీనామా అధికార పార్టీలో ఒకింత భయాందోళనకు గురిచేస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో అతిపెద్ద సామాజికవర్గమైన గౌడ సామాజికవర్గం చెందిన బూర నరసయ్య 10 నుంచి 15వేల ఓట్లని తనవైపు తిప్పుకునేంత శక్తి ఉంది. ఇప్పుడు మునుగోడులో 10వేల ఓట్లు అంటే పెద్ద మార్క్. ఇలాంటి సమయంలో బూర నర్సయ్య రాజీనామా చేయడం అధికార పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో బీజేపీకి అది పెద్ద వరంలా కూడా మారింది.

    బూర నర్సయ్య బీజేపీలో చేరితే ఆయన సామాజికవర్గ ఓటర్లు ఖచ్చితంగా కమలం పార్టీ వైపు చూస్తారనడంలో సందేహం లేదు. దీంతో పెద్ద ఓటు బ్యాంకు చేజారే అవకాశం ఉందంటూ గులాబీ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ మాత్రం బూర నర్సయ్య పార్టీలో చేరనుండటంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. బూర నరసయ్యగౌడ్ బీజేపీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కమలం శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండనుంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి సెంటిమెంట్‎తో పాటు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. మొత్తానికి బూర నర్సయ్యగౌడ్ రాజీనామా అంశం మాత్రం టీఆర్ఎస్‎కు పెద్ద మైనస్సే.

    Trending Stories

    Related Stories