మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. లేటెస్ట్ అప్డేట్స్

0
929

టీడీపీ మాజీ మంత్రి నారాయణ ను పోలీసులు అదుపులో తీసుకోవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఐకియా దగ్గర మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని చిత్తూరుకు తరలిస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు మొదట వార్తలు వచ్చాయి. నారాయణపై పేపర్ లీకేజీ కేసుతో పాటు ల్యాండ్ పూలింగ్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేశారు.

మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణిని పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సీఎం జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం అన్నారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రోజురోజుకూ ఏపీ సీఎం జగన్ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ వైపు చెబుతుంటే.. మరోవైపు ఇదే వ్యవహారంలో నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

మొదట ప్రశ్న పత్రం లీకేజీతో అరెస్టు చేసినట్టు వెల్లడించిన సిఐడి పోలీసులు. గంట వ్యవధిలో కేసును మార్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఏపీ రాజధాని భూముల కేసులో నారాయణను అరెస్ట్ చేశారనే కథనాలు వస్తున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో నారాయణ అరెస్ట్ జరిగిందని కథనాలు వచ్చాయి. మాజీ మంత్రి నారాయణను చిత్తూరుకు తరలించకుండా తెలంగాణ సిఐడి పోలీసులు అడ్డుకున్నారనే కథనాలు కూడా వస్తున్నాయి. తెలంగాణ- ఏపీ సిఐడి పోలీసుల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి.