నారాయణ కోర్టుకు హాజరవ్వాల్సిందే..!

0
1049

పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారాయణకు బెయిల్ కోసం ఇద్దరి పూచీకత్తుతో పాటు నారాయణను కోర్టులో హాజరుపర్చాలని చిత్తూరు నాలుగో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిన్న పూచీకత్తుగా ఇద్దరిని నారాయణ తరపున న్యాయవాదులు కోర్టులో హాజరుపరిచారు.

నారాయణ బెయిలు మంజూరుకు సంబంధించి జామీనుదారుల పూచీకత్తును ఆమోదిస్తూ మంగళవారం స్థానిక నాలుగో అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. నారాయణ తరపున న్యాయవాదుల వైఖరిపైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కోర్టులో హాజరుపర్చకపోతే బెయిల్ ఎలా ఇస్తామని ప్రశ్నించింది. దీంతో ఇవాళ నారాయణను కోర్టులో హాజరుపరుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం నాడు విచారణకు నారాయణ హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాదులు చంద్రశేఖర్‌ నాయుడు, రామకృష్ణ హాజరయ్యారు.

పదోతరగతి ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ కేసులో నారాయణను చిత్తూరు పోలీసులు ఈ నెల 10న రాత్రి స్థానిక నాలుగో అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సులోచనారాణి ఎదుట హాజరుపరచగా ఆయనకు రూ.లక్ష సొంత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీనుదారుల పూచీకత్తును ఈ నెల 18లోగా కోర్టుకు సమర్పించాల్సి ఉంది.