More

  భారత్‎లో BBC ని నిషేధించండి..! గళమెత్తిన సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలు..!!

  బీబీసీ వార్తా సంస్థ ప్రధాని మోదీపై విడుదల చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దీన్ని పూర్తి అవాస్తవ కథనాలతో రూపొందించారని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటన్ వలసవాద భావజాలంతోనే ఈ డాక్యుమెంటరీ తయారు చేసినట్లుందని.. భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ఈ డాక్యుమెంటరీని భారత్ లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీబీసీ విష ప్రచారాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాలంటే.. ఆ ఛానెల్ ప్రసారాలను భారత్ లో నిషేధించాలని న్యాయమూర్తులు, ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

  133 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, 156 మంది రిటైర్డ్ సాయుధ అధికారులతో పాటు 13 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. BBC డాక్యుమెంటరీని బ్రిటన్ వలసవాద భావనను వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. వలసవాద భావజాలాన్ని భారత్ పై రుద్దడం మానుకోవాలని హెచ్చరించారు. స్వాతంత్య్ర కాలం నాటి విభజించు పాలించు సిద్దాంతంతోనే బీబీసీ ఈ డాక్యుమెంటరీని తయారు చేసిందనీ,.. ఇప్పటికీ భారత్ లో హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోందని.. లేఖలో తెలిపారు. బీబీసీ డాక్యుమెంటరీని పరిశీలిస్తే.. పూర్తి అవాస్తవాల ఆధారంగానే దీన్ని రూపొందించినట్టు అర్థమవుతుందన్నారు. ఇందులో పూర్తిగా భ్రమలు, ఊహాగానాలే ఉన్నాయని.. న్యాయ వ్యవస్థలిచ్చిన తీర్పులను కూడా బీబీసీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఏమాత్రం లేదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించారు. అల్లర్లలో గుజరాత్ ప్రభుత్వానికి కూడా ప్రమేయం లేదన్నారు. అయితే బీబీసీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సొంత ఊహాగానాలతో ఈ డాక్యుమెంటరీని రూపొందించిందని విమర్శించారు. దీన్ని పరిశీలిస్తే బీబీసీ భారత న్యాయస్థానాల కంటే.. తానే ఎక్కువని ఊహించుకుంటోందని దుయ్యబట్టారు. ఇటువంటి వలసవాద భావనను బీబీసీ మానుకోవాలని హితవు పలికారు. స్వతంత్ర భారతదేశపు 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజల అభిష్టాన్ని ఈ డాక్యుమెంటరీ ధిక్కరిస్తోందని వారు పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి గౌరవమివ్వని బీబీసీ ని భారత్ లో పూర్తిగా నిషేధించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనిల్ డియో సింగ్, హోం శాఖ మాజీ కార్యదర్శి ఎల్‌సి గోయల్, మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్, రా మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి, ఎన్‌ఐఏ మాజీ డైరెక్టర్ యోగేష్ చందర్ మోదీ ఉన్నారు.

  ఇక బీబీసీ అవాస్తవ కథనాలను ప్రచురించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇటువంటి చర్యలకు పాల్పడింది. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా 4 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్నప్పుడు.. 2019 సంఘటనతో తన రిపోర్ట్ కార్డ్‌ను సమర్పించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, ఎలాంటి అల్లర్లు జరగలేదన్నారు. కానీ, బీబీసీ దీనిని జీర్ణించుకోలేక విషం కక్కే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో అల్లర్ల మాదిరిగానే క్రైమ్ రేట్ పెరిగిందని NCRB డేటాను ఉటంకిస్తూ ఒక నివేదికను ప్రచురించింది. అయితే ఈ నివేదికను UP పోలీసులు వాస్తవాల ద్వారా బీబీసీ కథనాన్ని తప్పుబట్టారు. దీంతో పాటు జైశ్రీరాం అనే నినాదాన్ని వార్ క్రై అంటూ సంబోధించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్ లో 10 వేల మందితో భారీ నిరసనలు జరిగాయని వార్త రాసింది. దీన్ని భారత హోం శాఖ కూడా తప్పుబట్టింది. ఇది పూర్తి అవాస్తవ కథనమనీ బారాముల్లాలో జరిగిన నిరసనలో 20 మంది కంటే ఎక్కువ లేరని తెలిపింది.

  ఇక తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీలో కూడా,.. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినా,.. దీన్ని పట్టించుకోకుండా బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ద్వారా ముస్లింలకు అన్యాయం చేసిందని బీబీసీ పేర్కొంది. అయితే ఇది వాస్తవానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు సహాయం చేసే చట్టమే తప్ప భారతీయ ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు.

  ఇక ఈ డాక్యుమెంటరీ ని నిషేధించాలని కేంద్ర ఐటీ శాఖ సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు, వార్తలు తీసేయాలని కేంద్రం సోషల్ మీడియా దిగ్గజాలను ఆదేశించింది. బీబీసీ ద్వారా డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్‌ను బ్లాక్ చేయమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా దిగ్గజాలకు చెప్పింది. BBC డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్‌ను ప్రచురించే అనేక యూట్యూబ్ వీడియోలను నిరోధించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. యూట్యూబ్ వీడియో లింక్‌లకు సంబంధించిన 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్‌లో మళ్లీ వీడియోను అప్‌లోడ్ చేయడాన్ని నిరోధించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వీడియోకు లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్‌లను గుర్తించి బ్లాక్ చేయమని ట్విట్టర్‌కు సూచించింది.

  Trending Stories

  Related Stories