అసదుద్దీన్ ఒవైసీ యొక్క AIMIM (ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత మొహమ్మద్ రువేద్ సబీర్, అతని భార్య సమీనా పర్వీన్ హిందూ మతంలోకి మారాలని భావిస్తూ ఉన్నారు. తమ కోరికను తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ సహాయం కోరుతూ ఉంది ఆ జంట. తమ సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులు, సంస్థల నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని దంపతులు తెలిపారు. ఈ విషయమై భార్యాభర్తలు మొరాదాబాద్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తమకు నచ్చిన మతంలోకి మారడం వీలవ్వడం లేదని ఫిర్యాదులో దంపతులు రాశారు. హిందూ మతంపై విశ్వాసం ఉందని, ఈ ప్రక్రియను ప్రారంభించడానికి తమ సంఘం నుండి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు.
ఏప్రిల్ 11న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, AIMIM మాజీ నాయకుడి భార్య సమీనా పర్వీన్ తన అత్తమామలతో పోరాడుతున్నప్పుడు తమ సామాజికవర్గం నుండి ఎవరూ తమకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో వారు హిందూ మతంలోకి మారాలనుకుంటున్నట్లు చెప్పడం వినవచ్చు. కట్నం కోసం అత్తామామలు ఆమెను వేధించే వారు. న్యాయం కోసం చాలా మంది ముస్లిం నాయకులు, సంస్థల తలుపులు తట్టినట్లు ఆమె పేర్కొంది, అయితే ఆమెను ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదు. అయితే స్వచ్ఛందంగా మతం మారే ప్రక్రియలో సహాయం కోసం ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సంప్రదించింది.
సమీనా పర్వీన్ AIMIM మాజీ నేత మహ్మద్ రువేద్ సాబీర్‌ను వివాహం చేసుకున్నప్పటి నుండి, అత్తారింటి కుటుంబం ఆమెను, ఆమె తల్లిదండ్రులను కట్నం కోసం వేధిస్తూనే వస్తున్నారని ఆరోపించింది. వివాహానికి ముందు, సబీర్ తల్లిదండ్రులు కుటుంబానికి ఏకైక కుమారుడని చెప్పి.. తన తండ్రి నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని ఆమె తెలిపింది. పెళ్లి తర్వాత కూడా కట్నం డిమాండ్ కొనసాగింది. సమీనా తండ్రి దగ్గర డబ్బు లేకపోవడంతో, ఆమె అత్తమామలు వారిని బెదిరించడం, వారిపై తప్పుడు కేసులు పెట్టడం ప్రారంభించారు. అత్తమామల డిమాండ్లను తీర్చేందుకు ఆమె తన నగలను అమ్మేసింది. కొంత సమయం తర్వాత ఆమె వద్ద కూడా డబ్బులు లేకపోవడంతో వారు ఆమెను వేధించడం ప్రారంభించారు. తాను ముస్లిం నేతలందరినీ, సంస్థలనూ సంప్రదించానని, అయితే తన అత్తమామల రాజకీయ పలుకుబడి, సంబంధాలకు భయపడి అందరూ వెనక్కి తగ్గారని సమీనా వాపోయింది. ఎవరైనా సహాయం చేయడానికి ఎంచుకున్నా, ఆమె అత్తమామలు తప్పుడు కేసులతో బెదిరించారని సమీనా తెలిపింది. కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేయని సమాజంలో ఉండడం వల్ల ప్రయోజనం లేదని సమీనా హిందూ ధర్మం స్వీకరించాలని నిర్ణయించుకుంది. “మా సంఘం నుండి ఎవరూ మాకు సహాయం చేయలేదు. ఇక మతం మార్చుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేకుండా పోయింది. మేము హిందూ ధర్మాన్ని స్వీకరిస్తాం” అని తన భర్త మహ్మద్ రువేద్ సాబీర్ తో కలిసి తెలిపింది.
మహ్మద్ రువేద్ సాబీర్ మాట్లాడుతూ తనకు యోగి ఆదిత్యనాథ్‌పై పూర్తి విశ్వాసం ఉందని, హిందూ మతంలోకి మారడంలో ఆయన సహాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వీడియోలో చెప్పడం వినవచ్చు. తాము పోరాడుతున్న వారంతా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గూండాలేనని ఆయన అన్నారు. మా నాన్న సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుదారుడు.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడని.. అందుకే తల్లిదండ్రులు మమ్మల్ని ఈ మేరకు హింసిస్తున్నారని మహ్మద్ రువేద్ సాబీర్ అన్నారు.
వీడియో వైరల్ తర్వాత మొరాదాబాద్ పోలీసుల ప్రకటన:
వీడియో వైరల్ అయిన రెండు రోజుల తర్వాత, మొరాదాబాద్ పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియో బైట్‌ను విడుదల చేశారు, అందులో సమీనా పర్వీన్ నుండి ఫిర్యాదు స్వీకరించినట్లు అంగీకరించారు. ఆస్తి విషయంలో సమీనా పర్వీన్, ఆమె భర్తను వేధిస్తూ ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఇటీవల సమీనా పర్వీన్, ఆమె భర్త మొహమ్మద్ రువేద్ సాబీర్ మరియు మరోవైపు సాబీర్ తండ్రి సాబీర్ హుస్సేన్, అతని ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్లతో కుటుంబం ఇప్పటికే కొంతకాలంగా న్యాయపరమైన తగాదాలలో ఉందని పోలీసులు ధృవీకరించారు.
సమీనా పర్వీన్ 2021లో కూడా తన బావపై ఐపీసీ సెక్షన్ 313 (మహిళల అనుమతి లేకుండా గర్భస్రావం చేయడం), 386 (దోపిడీ) కింద కేసులు పెట్టిందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు, 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతి భంగం కలిగించేలా అవమానించడం) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు ఈ కేసులో తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.