భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని శక్తిగా ఉంది. ఎన్నో రాష్ట్రాల్లో పట్టు సాధిస్తూ దూసుకుపోతోంది. చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మరో వైపు ప్రాంతీయ పార్టీలతో మమేకమై పలు రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకుంటూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు లేరు.. నాయకత్వంలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో బీజేపీ ప్రభావాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని రాహుల్ గాంధీ అవగాహన చేసుకోలేకపోతున్నారని.. ఆయనతో ఉన్న ప్రధాన సమస్య అదే అని అంటున్నారు ప్రశాంత్ కిశోర్ . ఈ వ్యాఖ్యలను బట్టి ఇన్ని రోజులూ కాంగ్రెస్ లో కీలక పదవిని ప్రశాంత్ కిషోర్ చేపడతారనే వాదన బలంగా వినిపించగా.. ఇప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మరికొన్ని దశాబ్దాల పాటు కేంద్రంగా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్లు నరేంద్రమోదీని కానీ బీజేపీని కానీ ప్రజలు వదులుకోవడం జరగదని.. బీజేపీ ప్రభావం ఇంకో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావితం చేస్తుందని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎలా ప్రభావితం చేసిందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి మోదీని ప్రజలు తిరస్కరిస్తారని కొందరు అంటున్నారని.. 30 శాతం ఓటు బ్యాంక్ సాధించిన ఏ పార్టీ అయినా ప్రజల నుంచి అంత తొందరగా పోదని అన్నారు. మోదీ ఉంటారా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ మాత్రం ఉంటుందని అన్నారు. చాలా దశాబ్దాల పాటే ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. మోదీని ప్రజలు విసిరి కొడతారని రాహుల్ ఇంకా అనుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. మోదీని ప్రజలు తిరస్కరిస్తారని రాహుల్ గాంధీ భ్రమపడుతున్నారు. ఇలాంటిదేమీ జరగదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే మోదీ ఎంత బలంగా ఉన్నారో అర్థం అవుతుందని.. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ ఆయనకు ఎదురు వెళ్లలేరని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ బలాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకోనంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించటం అసాధ్యమని ఇది రాహుల్ గాంధీ గ్రహించాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. మరిన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాల్ని బీజేపీనే ఏలుతుందని ప్రశాంత్ కిశోర్ కూడా అంగీకరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదే నిజమని.. ఈ విషయాన్ని కొన్ని సంవత్సరాల కిందటే అమిత్ షా చెప్పారని బీజేపీ నేతలు అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోసం ఇటీవలి ఎన్నికలకు పనిచేశారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రస్తుత సీఎం స్టాలిన్ కోసం పనిచేసి విజయాన్ని అందించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేసిన సంగతి తెలిసిందే..! గోవాలో జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం గోవాలో ఉన్నారు ప్రశాంత్ కిశోర్.