More

  ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉన్నా.. ఉక్కుపాదం మోపాల్సిందే..! ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో మోదీ

  పిరికివాడు క్షణ క్షణం చస్తూవుంటే, ధైర్యవంతుడు ఒకేసారి వీర మరణం పొందుతాడు. నిర్లక్ష్యం నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకోవచ్చు. అలక్ష్యంతో అసలుకే మోసం రావచ్చు. భయపడే వాడిని చూస్తే బరిదెగించిన వాడు రెచ్చిపోతాడు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కోట్టాలి.. ఇవన్నీ సామెతలే కావచ్చు. జీవితంలో ప్రతి అంశానికి వీటిని అన్వయించుకుని ధైర్యసాహసాలతో ముందుకు వెళితే.. తోక జాడించే వాళ్లు తోక ముడుస్తారు. ముష్కర మూకల ఉగ్రదాడులపై అష్టదిగ్బంధ చర్యలు తీసుకుని.. అధ:పాతాళానికి తొక్కేయాలి. ఇదే ప్రపంచ దేశాల ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు ప్రధాన ఉద్దేశం. పలు దేశాల మంత్రులు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, పలు ఉగ్ర నిరోధక సంస్థల అధినేతలు పాల్గొన్న రెండు రోజుల అంతర్జాతీయ ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సును మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని ఉగ్రదాడులు సమాన ఆగ్రహానికి, చర్యకు అర్హమైనవని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

  చిన్నదాడి, పెద్ద దాడి, ఒక దాడి, రెండు దాడులు అనే బేధం లేకుండా.. ఉగ్రదాడిని ఉక్కుపాదంతో అణచివేయాలనే భావనను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. ఒక్క దాడిని సైతం చాలా ఎక్కువని భావిస్తున్నామని,.. ఒక్క ప్రాణం పోయినా తిరిగి రాదని, ప్రతి ప్రాణం అమూల్యమైనదే అని ప్రధాని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్ ను దెబ్బతీయడానికి ప్రయత్నాలు సాగిస్తోందని, దీనిని సమర్థవంతంగా, ధైర్య సాహసాలతో ఎదుర్కొంటున్నామని చెప్పారు.

  ఉగ్రవాదం ఇంట్లోకి వచ్చేదాకా వేచి చూడవద్దని, ఎక్కడ ఉగ్రవాదం వున్నా తరిమికొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రమూకలకు మద్దతు ఇచ్చే నెట్ వర్క్ లను విచ్చిన్నం చేయాలని, ఉగ్రవాదుల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయాలని తెలిపారు. ఉగ్రవాద నిరోధానికి చురుకైన, వ్యవస్థీకృత స్పందన అవసరం అని ఆయన తెలిపారు. నిరంతరం ముప్పులో ఉన్న ప్రాంతాలపై ఎవరూ ఇష్టాన్ని చూపరని ఇది వివిధ అనర్థాలకు దారితీస్తుందని, ఈ కారణంగా, ప్రజల జీవనోపాధికి విఘాతం ఏర్పడుతుందని ప్రధాని చెప్పారు. ఇందుకే.. టెర్రర్ ఫైనాన్సింగ్ మూలాలను కూకటి వేళ్లతో పెకలించాల్సి వుందని అన్నారు. ఉగ్రవాదం అంటే.. మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడి, అమానుషకాండ అని ఆయన అభివర్ణించారు. ప్రపంచం ముప్పునకు గురైనప్పుడు అస్పష్ట విధానాలకు తావుండరాదని.. ధైర్యసాహసాలతో ముందుకెళ్లి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు.

  కొన్ని దేశాలు విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని, ఆ దేశాలు ముష్కరులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా వుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఎంతో హేయమైన చర్య అన్నారు. అలాంటి వారిపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం ఏకమవ్వాలని కోరారు.

  నో మనీ ఫర్ టెర్రర్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, పలు ఉగ్ర నిరోధక సంస్థల అధినేతలు దాదాపు 450 మంది పాల్గొంటున్నారు. ఉగ్రవాద నిధుల నిరోధంపై జరుగుతున్న మూడో సదస్సు ఇది. అంతకు ముందు 2018 ఏప్రిల్ లో పారిస్ వేదికగా, 2019 నవంబర్ లో మెల్ బోర్న్ లో నో మని ఫర్ టెర్రర సదస్సులు జరిగాయి.

  ‘నో మనీ ఫర్ టెర్రర్’సదస్సులో ప్రధాని మోదీ వెల్లడించిన ప్రతి అక్షరం అసలు సిసలు సత్యాలే. టెర్రరిజాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రతి దేశం ముందుకు రావాల్సిన ఆవశ్యకత వుంది. ఎక్కడో ఏదో మూల చిన్న సంఘటనగా.. టెర్రరిజాన్ని ఎప్పుడూ చూడకూడదు. అదే ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం.

  Trending Stories

  Related Stories